ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఇంటికే నడిచొచ్చింది
ఆస్టిన్ (అమెరికా): ఆన్‌లైన్‌లో కారును ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడికి ఆ కారు డ్రైవర్ లేకుండా స్వయంగా దానంతట అదే ఇంటికి వచ్చి చేరితే ఆశ్చర్యం కలగక మానదు కదా!. అమెరికాలో అచ్చం అలానే జరిగింది. ఆస్టిన్‌లో నివాసముండే వినియోగదారుడికి తాను బుక్ చేసుకున్న కారు ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా తన ఇంటికి వచ్చి చేరింది. ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా తన నూతన ‘మోడల్ వై’ ఎస్‌యూవీతో ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు జర్నీ వీడియోను టెస్లా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. టెక్సాస్ గిగాఫాక్టరీ నుంచి బయలుదేరిన కారు.. డ్రైవర్ లేకుండా రహదారులపై వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తూ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుంటూ ట్రాఫిక్ సిగ్నళ్లను, మలుపులను దాటుకుంటూ యజమాని ఇంటికి చేరుకుని పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లి నిలిచింది. ఈ మేరకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ.. తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కారు దాదాపు గంటకు 115 కి.మీ వేగాన్ని అందుకుందని టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ వెల్లడించారు.
Comments