ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు
భారతీనగర్ : రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన జిల్లాల్లో ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ, డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం గురునానక్ రోడ్డులోని శుభలగ్న వేదిక ఫంక్షన్‌హాల్‌లో సంఘ అధ్యక్షుడు పుట్టగుంట రమేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రప్రభుత్వం అనేక పరిశ్రమలను ప్రోత్సహించనున్న నేపథ్యంలో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా లభించే అవకాశముందన్నారు. అలాగే ఐటీఐ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. త్వరలో కేంద్రప్రభుత్వంతో సంప్రదించి తిరువూరులో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు.
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యారంగంలో ఐటీఐలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరేది డిమాండ్లు పరిష్కరించమని కాదని, ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొమ్మును మాత్రమే చెల్లించమని అడుగుతున్నామన్నారు. ఇప్పటికీ 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం రెండయినా ప్రకటించాలని కోరారు. అనంతరం ఇటీవల జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన ఏ విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన డీవీ రమణను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘనంగా సత్కరించారు. ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ జేడీ జీ బాలసుబ్రహ్మణ్యం, ఏపీ గవర్నమెంట్ ఐటీఐ, డీఎల్‌టీసీ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకట రమే్‌షబాబు, ప్రధాన కార్యదర్శి కే రత్నరాజు, కోశాధికారి కేఎస్ శ్రీనివాసరావు, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు డీఎస్ఎన్ రెడ్డి, వీవీ ప్రసాద్, పీ రమేష్, సిటీ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, రాష్ట్రంలోని వివిధ ఐటీఐ కళాశాలలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments