ఓట్ చోర్.. గద్దీ ఛోడ్కు 5 కోట్ల మంది మద్దతు
న్యూఢిల్లీ : ఎన్నికల అక్రమాలను ఎండగట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమం లో 5 కోట్ల మంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్, బీజేపీ కుమ్మక్కై చేస్తున్న ఓటు చోరీ ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై సాధారణ పౌరుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ నెల 8న అన్ని రాష్ట్రాల కార్యాలయాల్లో ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమాలతో ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ తొలిదశను ముగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆ తర్వాత సంతకాల సేకరణకు సంబంధించిన సమగ్ర వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని పీసీసీలకు సూచించారు. రెండోదశలో భాగంగా సంతకాల సేకరణ తిరిగి కొనసాగుతుందని.. కోట్లాది ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబమైన ఆ సంతకాలను రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. ‘‘ఫొటోలతో కూడిన మెషీన్ రీడబుల్ ఓటరు జాబితాను ప్రచురించాలి. తప్పుడు ఓటర్ల తొలగింపు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఓటరు జాబితా మార్పుల కోసం స్పష్టమైన కటాఫ్ తేదీని ప్రకటించాలి. ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలకు కారణమైన అధికారులతోపాటు ఏజెంట్లపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అనే డిమాండ్లను కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెడతామని ఆయన తెలిపారు.










Comments