కార్యకర్తలు నడిపించే పార్టీ టీడీపీయే
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవంతో రాష్ర్టాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారని ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు నడిపించే పార్టీ ఒక్క టీడీపీయేనన్నారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే రూ.135 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగన్ ఏనాడూ సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, కనీసం వారికి చేయి కూడా అందించడని విమర్శించారు. సొంత కార్యకర్త కారు కిందపడి చనిపోతే పక్కన పడేసి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ‘మీకు నేను ఎంత చేసినా తక్కువే. ఐదేళ్లు వైసీపీపై పోరాడారు. అందుకే జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు నేను గానీ.. సీఎం గానీ ముందుగా కార్యకర్తలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాం’ అని చెప్పారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని అలసట వీడి ముందడుగు వేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా... అధికారంలో ఉన్నా... ఆయన రేయింబవళ్లూ కష్డపడతారని అన్నారు. ఇటీవల తాను ప్రధానిని చూసి ఆశ్చర్యపోయానని, 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా రాష్ర్టాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు.’ అని తెలిపారు.
‘నాకు అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు లేరు. స్వర్గీయ ఎన్టీఆర్ నాకు కోటి మంది టీడీపీ కుటుంబ సభ్యులను ఇచ్చారు. పసుపు జెండాను చూసినా, రంగును చూసినా మనకు ఎమోషనే... కార్యకర్తలను చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేశ్’ అని మంత్రి చెప్పారు. ‘తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం... అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ. మా కుటుంబాన్ని మీరు దీవించారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణను అక్కున చేర్చుకుని గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో సూపర్ మెజారిటీ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు.










Comments