తిరుపతి ఎన్ఎస్యూ కేసులో ఆ ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్ట్
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా లోని బాధితురాలి ఇంటి వద్ద విచారణ చేపట్టిన తిరుపతి వెస్ట్ పోలీసులు .. యువతి ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఈ విచారణలో పోలీసులు కీలక వివరాలను రాబట్టినట్టు సమాచారం.
ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ .. తనను పలుమార్లు లైంగికంగా వేధించారంటూ.. స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలను బాధితురాలు వెల్లడించింది. ఆ వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. అయితే.. 'ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద మన ఇద్దరి వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో ఎలా వెళ్లింది' అని ప్రశ్నిస్తూ వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. కానీ, ప్రొ.శేఖర్ రెడ్డి తనతో ఎప్పుడూ మాట్లాడలేదని పోలీసుల విచారణలో పేర్కొంది బాధితురాలు.
బాధిత యువతి ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రొ.లక్ష్మణ్ కుమార్ సహా మరో ప్రొ.శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లోని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.










Comments