నిద్రిస్తుండగా.. కాటేసిన మృత్యువు
గజపతినగరం : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు విజయనగరం జిల్లా గజపతినగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ద త్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన వంగర రామకృష్ణ(51), మార్పిన అప్పలనాయుడు(33), మరాడ రాము(50), గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన బండారు చంద్రరావు(35)తో పాటు రామభద్రపురం మండలం కొండ కెంగువ గ్రామానికి చెందిన బెవర శ్రీరాములు ఈ నెల 1వ తేదీన కారులో శబరిమల వెళ్లారు. అయ్యప్ప దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో శుక్రవారం రాత్రి రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నారు. మార్గమధ్యలో అర్ధరాత్రి కుంబిడుమదురై ప్రాంతంలో కారు రోడ్డు పక్కన నిలిపి అందరూ అందులోనే నిద్రిస్తున్నారు. అదే సమయంలో ఏర్వాడి నుంచి రామనాఽథపురం జిల్లా కీళకరైకు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న అయ్యప్ప భక్తుల కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ, అప్పలనాయుడు, చంద్రరావు మరో కారు డ్రైవర్ ముస్తాక్ అహ్మద్ (30) అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాహనాల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వారిని బయటకు తీసి రామనాఽథపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సందీష్, కీళకరై ఇన్స్‌పెక్టర్ పద్మనాభన్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ముస్తాక్ అహ్మద్ అధికార డీఎంకే అనుబంధ డ్రైవర్ల సంఘం నిర్వాహకుడని తెలిసింది. ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం బయల్దేరిన భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందని తెలిపారు. క్షతగ్రాతుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అక్కడి జిల్లా కలెక్టర్‌ను ఫోన్‌లో కోరారు. మృతదేహాలను స్వగ్రామాలకు త్వరగా చేరుకునే చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.









Comments