పల్లెల్లో అశాంతి పోయి ప్రశాంతత వచ్చింది
విడపనకల్లు : టీడీపీ కూటమి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని పల్లెల్లో అశాంతి తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు అభద్రత, అశాంతి నడుమ జీవనం సాగించారు’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డొనేకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన వివిధ పథకాలను వివరించారు. రైతులకు అన్నదాతాసుఖీభవ సొమ్మును త్వరలోనే అందిస్తామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అంకోలా జాతీయ రహదారిని పూర్తి చేయలేదని విమర్శించారు. ‘‘జగన్ రోడ్లెక్కి ఎక్కడికి వెళ్లినా అశాంతిని సృష్టిస్తున్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లి మహిళలపై దాడులు చేయించారు. ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లి కారు టైరు కింద మరో వ్యక్తి నలిగిపోయేలా చేశారు. రప్పా రప్పా నరుకుతామంటే మంచితే కదా అని జగన్ అంటున్నారు. ‘ప్రజలారా... నరుక్కుని చావండి... రౌడీల్లారా నా వెంట రండి...’ అంటున్నారు. చంద్రబాబు పాలనలో అలాంటి ఆటలు సాగవు. ప్రశాంతత, స్వేచ్ఛను ఇచ్చే ప్రభుత్వం మాది’’ అని అన్నారు. జగన్, రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారంటూ మంత్రి వివరణాత్మక విమర్శ చేశారు.
Comments