ఫుట్‌బాల్ ఆడేస్తున్న రోబోలు
బీజింగ్ : ఇంతకాలం రోబోలు ఇంట్లో పనులు చేయడం లేదా రెస్టారెంట్లలో వంటకాలు సర్ ్వ చేయడం చూశాం. కానీ కృత్రిమ మేధ సహాయంతో మరమనుషులు ఫుట్‌బాల్ ఆడితే?.. చైనా ఇదే చేసి చూపించింది! మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్ బాల్ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు. ఇటీవల చైనా పురుషుల ఫుట్‌బాల్ జట్టు తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం వాటికున్న అడ్వాన్స్‌డ్ విజువల్ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ అలరించాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేవడం, మానవుల సాయం లేకుండా పూర్తి ఏఐ ఆధారిత సాంకేతికతతో ముందుకు కదలడం ఇలా ఒకటేమిటీ అన్ని రకాల ఫుట్‌బాల్ నైపుణ్యాల్ని ప్రదర్శించాయి. ఆటల్లో గాయపడిన రోబోలను స్ట్రెచర్ల సాయంతో సిబ్బంది బయటకు తీసుకెళ్లడం ఆటకు మరింత సహజత్వాన్ని ఇచ్చింది. త్వరలో జరిగే ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ పోటీలకు ప్రివ్యూగా శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో ఈ పోటీలు జరిగాయి. బూస్టర్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన నాలుగు హ్యూమనాయిడ్ రోబోట్ జట్లు ఈ పోటీల్లో కనువిందు చేశాయి. భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి ఆడే పరిస్థితులు వస్తాయని బూస్టర్ రోబోటిక్స్ సీఈవో చెంగ్ హావో అన్నారు. ఫైనల్స్ మ్యాచ్‌లో త్సింగ్‌హువా యూనివర్సిటీ జట్టు, చైనా వ్యవసాయ యూనివర్సిటీ మౌంట్ సీ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
Comments