మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
టెక్సాస్: అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తి)గా మార్చగలిగే పారితోషిక ప్యాకేజీకి కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో మస్క్ పారితోషిక ప్యాకేజీకి సుముఖంగా 75 శాతం మంది ఓటు వేశారు. ఈ సెప్టెంబరులో టెస్లా బోర్డు మస్క్‌కు భవిష్యత్‌లో ట్రిలియన్ డాలర్ల విలువ చేసే పనితీరు ఆధారిత ప్యాకేజీని ఆఫర్ చేసింది. ప్రపంచ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకిదే అతిపెద్ద ప్యాకేజీ. బీవైడీ, ఇతర చైనా కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక విక్రయాలు భారీగా తగ్గి డీలాపడిన టెస్లా ఈ ప్యాకేజీలో భాగంగా మస్క్‌కు అత్యంత భారీ లక్ష్యాలను నిర్దేశించింది. కంపెనీ మార్కెట్ విలువను (క్యాపిటలైజేషన్) ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్ల (8.5 లక్షల కోట్ల డాలర్లు) స్థాయికి చేర్చడం, కంపెనీ కార్ల వార్షిక విక్రయాలను గత ఏడాదిలో నమోదైన 20 లక్షల లోపు యూనిట్ల నుంచి 2 కోట్ల యూనిట్లకు పెంచడం, రోబో ట్యాక్సీలు, హ్యుమనాయిడ్ రోబోల అమ్మకాలను 10 లక్షల యూనిట్లకు పెంచడం అందులో ప్రధానమైనవి. లక్ష్యాలన్నింటినీ చేరుకుంటేనే, ప్యాకేజీలో భాగంగా ఆఫర్ చేసిన 42.37 కోట్ల కంపెనీ షేర్లు మస్క్‌కు దక్కుతాయి. ప్రస్తుతం వాటి విలువ 8,780 కోట్ల డాలర్లు. పదేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ 8.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరితే ఆయన వాటా షేర్ల మొత్తం విలువ ట్రిలియన్ డాలర్లు దాటనుంది. ఈ ప్యాకేజీ ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే, మస్క్ కంపెనీలో కనీసం ఏడున్నరేళ్లు కొనసాగాలి.
చిప్‌ల తయారీలోకి టెస్లా: టెస్లా సెమీకండక్టర్ల (చిప్) తయారీలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశంలో మస్క్ వెల్లడించారు. స్వయం చోదక వాహనాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న కంపెనీ.. ఇందుకు అవసరమైన ఏఐ ఆధారిత చిప్‌ల కోసం ఇతర సంస్థలపై ఆధారపడకుండా సొంతగా తయారు చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఐదు, ఆపై తరాల ఏఐ చిప్‌ల తయారీ కోసం టెస్లా టెరాఫ్యాబ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, అందులో భాగంగా ఇంటెల్‌తో కలిసి పనిచేయనున్నట్ల్లు మస్క్ తెలిపారు.










Comments