• Jul 14, 2025
  • NPN Log

    బర్మింగ్‌హామ్‌: ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడని టీమిండియా ముంగిట సువర్ణావకాశం. వరుసగా నాలుగో రోజూ ఆధిపత్యం చూపుతూ.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టింది. దీంతో గిల్‌ సేన ఇంగ్లండ్‌ ముందుంచిన లక్ష్యం ఏకంగా 608 పరుగులు. టెస్టు చరిత్రలో ఏ జట్టు కూడా గతంలో ఇంత స్కోరును ఛేదించింది లేదు. ఇప్పటికే పేసర్ల తడాఖాతో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్త్తిడిలో పడింది. ఇక ఆఖరి రోజు ఆదివారం ఇంగ్లండ్‌ గేమ్‌ప్లాన్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మిగిలిన బ్యాటర్లు బజ్‌బాల్‌ ఆటతో ముందుకు సాగాలనుకున్నా మరో 536 రన్స్‌ సాధించడం స్టోక్స్‌ సేనకు దాదాపు అసాధ్యమే. అందుకే భారత్‌ విజయాన్ని అడ్డుకోవాలనుకుంటే వారికి డ్రా కోసం ఆడడం తప్ప మరో దారి లేదు. అటు మూడు సెషన్లలోపే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి అద్భుత విజయాన్నందించేందుకు భారత బౌలర్లు ఎదురుచూస్తున్నారు. అంతకముందు కెప్టెన్‌ గిల్‌ (162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) తన అసాధారణ ఫామ్‌తో మరో శతకం సాధించాడు. అతడికి జడేజా (69 నాటౌట్‌), పంత్‌ (65), రాహుల్‌ (55) అర్ధసెంచరీలతో సహకరించారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 427/6 దగ్గర డిక్లేర్‌ చేసింది. దీంతో జట్టుకు మొత్తం 607 పరుగుల ఆధిక్యం లభించింది. టంగ్‌, బషీర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసింది. డకెట్‌ (25) ఫర్వాలేదనిపించగా.. క్రీజులో పోప్‌ (24 బ్యాటింగ్‌), బ్రూక్‌ (15 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆకాశ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

    పంత్‌ జోరు: నాలుగో రోజు ఉదయం ఆకాశం మేఘావృతంగా ఉండడంతో తొలి గంట ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రభావం చూపారు. ఫుల్‌ లెంగ్త్‌ బంతులతో ఇబ్బందిపెట్టడంతో ఆరంభంలోనే కరుణ్‌ నాయర్‌ (26) వికెట్‌ను కోల్పోయింది. పేసర్‌ కార్స్‌ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో ఆకట్టుకున్నా ఆరో బంతికి తను కీపర్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 64/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా, మరో 22 పరుగులు జోడించి రెండో వికెట్‌ను కోల్పోయింది. అటు రాహుల్‌ మాత్రం అడపాదడపా బౌండరీలతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే డ్రింక్స్‌ తర్వాత టంగ్‌ ఎక్స్‌ట్రా పేస్‌తో వేసిన బంతికి అతడు బౌల్డయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చీ రాగానే పంత్‌ బ్యాట్‌కు పనిజెప్పాడు. టంగ్‌ ఓవర్‌లో తను 4,6 బాదడంతో పాటు తన మరుసటి ఓవర్‌లోనూ 4,6.. ఆ వెంటనే బషీర్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించాడు. దీంతో స్కోరులో వేగం పెరగ్గా, 357 పరుగుల ఆధిక్యంతో జట్టు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.

     

    గిల్‌ మరో శతకం: రెండో సెషన్‌లో పంత్‌-గిల్‌ జోడీ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా టంగ్‌ను లక్ష్యంగా చేసుకున్న గిల్‌ సెషన్‌ రెండో ఓవర్‌లోనే 6,4,4తో 14 రన్స్‌ రాబట్టాడు. టంగ్‌ తర్వాతి ఓవర్‌లోనూ 6,4తో ఆకట్టుకున్నాడు. దీంతో పంత్‌కన్నా ముందే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు 48 బంతుల్లోనే పంత్‌ కూడా అర్ధసెంచరీ సాధించగా, అతడి సిక్సర్‌తో జట్టు ఆధిక్యం 400కి చేరింది. అయితే వేగంగా ఆడే క్రమంలో స్పిన్నర్‌ బషీర్‌ ఓవర్‌లో పంత్‌ లాంగా్‌ఫలో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన జడేజా మాత్రం డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. అటు గిల్‌ కూడా నెమ్మదించడంతో బౌండరీలు రావడమే కష్టమైంది. ఈ సెషన్‌ చివర్లో గిల్‌ శతకం పూర్తి చేశాడు.

     

     

     

    భారీ ఆధిక్యంతో..: 484 రన్స్‌ ఆధిక్యంతో చివరి సెషన్‌ ఆరంభించిన భారత్‌ మరో గంటపాటు బ్యాటింగ్‌ చేసి 123 రన్స్‌ రాబట్టింది. ఆరంభం నుంచే గిల్‌-జడేజా వీలైనంత వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. సెషన్‌ రెండో ఓవర్‌ (వోక్స్‌)లోనే గిల్‌ 6,4,4తో 18 రన్స్‌ రాబట్టాడు. ఆ తర్వాత వోక్స్‌ మరో ఓవర్‌ మాత్రమే వేయగా, స్పిన్నర్లు బషీర్‌, రూట్‌లతోనే కెప్టెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ వేయించాడు. అటు గిల్‌ ఈ ఇద్దరినీ బాదేస్తూ బౌండరీలతో చెలరేగాడు. దీంతో 156 బంతుల్లోనే 150 రన్స్‌ పూర్తి చేశాడు. అయితే బషీర్‌ ఓవర్‌లో రిటర్న్‌ క్యాచ్‌తో గిల్‌ అవుట్‌ కావడంతో ఐదో వికెట్‌కు 175 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రెండు ఓవర్లలోనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. నితీశ్‌ (1) మరోసారి నిరాశపర్చాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement