విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం
ఆదోని : అనారోగ్యం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సి.బెళగల్ మండలానికి చెందిన బాలిక పత్తికొండ మండలంలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతోంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిక ఒత్తిడిలోనూ ఉంది. దీంతో శుక్రవారం ఉదయం బాలికను తల్లి ఎమ్మిగనూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరుగుప్రయాణంలో బస్టాండ్ వద్ద తప్పిపోయిన బాలిక సాయంత్రం 6.30 గంటలకు ఆదోనిలో ఆదోని-ఆస్పరి బైపాస్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ఆదోని మండలం ఇస్వీ గ్రామానికి చెందిన రమేశ్ ఆటోలో ఆమె తిరిగి బస్టాండ్‌కు చేరుకుంది. తల్లిదండ్రులకు ఫోన్ చేసేందుకు ఫోన్ ఇవ్వాలని బాలిక ఆటో డ్రైవర్‌ను అడగగా ఇవ్వలేదు. ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు గమనించిన రమేశ్ మాటలు కలిపాడు. కులం, కుటుంబ వివరాలు అడిగాడు. తనదీ అదే కులమని చెప్పాడు. చీకటి పడిన సమయంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదని, తన అక్క ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్ పక్కనున్న ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో రమేశ్ భయపడి తిరిగి ఆటోలో ఆదోని పట్టణంలోకి తీసుకొచ్చాడు. స్నేహితుడి సాయంతో బాలికను ఓ ప్రైవేటు హాస్టల్‌కు తీసుకెళ్లాడు. బాలికను హాస్టల్‌లో ఉంచడానికి పోలీసుల అనుమతి అవసరమని నిర్వాహకులు చెప్పడంతో తిరిగి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ త్రీటౌన్ సీఐ రామలింగయ్య బాలికను విచారించగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలో జరిగినందున అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశామని తాలుకా సీఐ నల్లప్ప తెలిపారు.
Comments