వైభవ్ సునామీ ఇన్నింగ్స్
వర్సెస్టర్: యూత్ క్రికెట్‌లో వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ అండర్-19తో శనివారం జరిగిన నాలుగో వన్డేలో వైభవ్ (78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్స్‌లతో 143) భారీ షాట్లతో మోత మోగించాడు. 52 బంతుల్లోనే వంద మార్క్‌కు చేరుకొన్న వైభవ్.. యూత్ వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ 53 బంతుల్లో శతకం రికార్డును బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అంగద్ బవా ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ రికార్డును కూడా వైభవ్ తుడిచిపెట్టేశాడు. అంతేకాకుండా పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా బంగ్లాదేశ్ క్రికెటర్ నజ్ముల్ షాంటో (14 ఏళ్ల 241 రోజులు) రికార్డును కూడా సూర్యవంశీ (14 ఏళ్ల 100 రోజులు) అధిగమించాడు. భారత్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ (15 ఏళ్ల 338 రోజులు)ను కూడా వైభవ్ వెనక్కినెట్టాడు.
కాగా, సూర్యవంశీ ఊచకోతతో భారత్ అండర్-19 టీమ్ 55 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీ్‌సను సొంతం చేసుకొంది. తొలుత భారత్ 50 ఓవర్లలో 363/9 స్కోరు చేసింది. విహాన్ మల్హోత్రా (129) కూడా శతకం సాధించాడు. ఛేదనలో ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (107) పోరాటం వృథా అయింది. నమన్ పుష్పక్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Comments