సీఎం చంద్రబాబుకు నేడు తిరువూరు నివేదిక
అమరావతి : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. తిరువూరు పంచాయితీకి సంబంధించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ ఆయనకు సమర్పించనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనంతర పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. తిరువూరు సీటు కోసం చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చానని కొలికపూడి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు ఆయన తగిన ఆధారాలు చూపలేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేవలం చిన్నితో వ్యక్తిగత విభేదాలతో పార్టీని అప్రతిష్ఠ పాల్జేసేలా ఎమ్మెల్యే విమర్శలు చేశారని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. దాని నివేదికపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటారు. సంస్థాగత నిర్మాణంతోపాటు పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నియామకంపై పార్టీ నేతలతో చర్చించి ప్రకటించే అవకాశం ఉంది. గత వారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల జాబితా సిద్ధంగా ఉందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఓ గంట చర్చించి ఖరారు చేయడమే తరువాయని ఆయన తెలిపారు.
ఆ రెండు నియోజకవర్గాల్లో తప్ప..
నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ సరిగా నిర్వహించడం లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకుగాను 173 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పి.గన్నవరం, అవనిగడ్డ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం సమాచారం సేకరించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో ఎవరు అందుబాటులో ఉన్నారనే విషయాలను కూడా కేంద్ర కార్యాలయ వర్గాలు సేకరించాయి.
టీడీపీ కమిటీల ప్రమాణస్వీకారం
ఈ నెల 11, 12, 13 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని మండల, వార్డు, గ్రామ కమిటీలతోపాటు క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.










Comments