అమెరికాలో అగ్నిప్రమాదం..
ఘట్‌కేసర్ రూరల్ : అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో అగ్నిప్రమాదం సంభవించి తెలంగాణకు చెందిన ఉడుముల సహజారెడ్డి(24) అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చౌదరిగూడలోని శ్రీనివాసనగర్‌లో నివాసముండే ఉడుముల జయాకర్‌రెడ్డి, మరియా శైలజ దంపతుల కుమార్తె అయిన సహజారెడ్డి.. ఎంఎస్ అభ్యసించేందుకు నాలుగేళ్ల క్రితం అలబామా ప్రాంతంలోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లారు. అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి సహజారెడ్డి నిద్రలో ఉన్న సమయంలో వీరి అపార్టుమెంట్ పక్కనున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఆపై మంటలు వీరి అపార్టుమెంట్‌కూ వ్యాపించాయి. అపార్టుమెంట్‌లో మొత్తం 13 మంది ఉండగా.. మంటలను గమనించిన 10 మంది తప్పించుకున్నారు. నిద్రలో ఉన్న సహజ సహా ముగ్గురు మంటలను గుర్తించకపోవడంతో అందులో చిక్కుకున్నారు. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో తప్పించుకునే పరిస్థితి లేకుండాపోయింది. అదే సమయంలో కాలుతున్న చెక్కలు సహజపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహజను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, అధికారుల ద్వారా కూతురి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హతాశులయ్యారు.
చదువు పూర్తి చేసుకొని త్వరలో ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ.. ప్రతి రోజూ వీడియో కాల్‌లో మాట్లాడే తమ కూతురు ఇక తిరిగి రాదన్న విషయం తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. సహజ తండ్రి జయాకర్‌రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని గుంటూరుపల్లి కాగా, ఆయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి శైలజ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో టీచర్‌గా పనిచేసి.. ఇటీవల డిప్యుటేషన్‌ఫై హైదరాబాద్‌కు వెళ్లారు. సహజ మరణవార్త విని ఇటు చౌదరిగూడ, అటు గుంటూరుపల్లిలో విషాదం అలముకుంది. సహజ మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సహజ మృతదేహం ఈ నెల 11న గుంటూరుపల్లికి చేరుకుంటుందని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.








Comments