• Dec 07, 2025
  • NPN Log

    అమరావతి : ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) మాజీ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డికి హైకోర్టు గట్టిషాక్‌ ఇచ్చింది. బోటనీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నూకన్న దొరను కొనసాగించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని నిర్ధారిస్తూ ప్రసాదరెడ్డికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఈనెల 22వ తేదీ వరకు సస్పెండ్‌ చేసింది. అప్పీల్‌ దాఖలు చేయకున్నా, స్టే రాకపోయినా డిసెంబరు 22న సాయంత్రం 5 గంటల లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)వద్ద లొంగిపోవాలని ప్రసాదరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గతనెల 20న తీర్పు ఇచ్చారు. తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. నూకన్న 2006 జూలైలో ఏయూ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల బోటనీ విభాగంలో నియమితులయ్యారు. కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌గా 17ఏళ్ల పాటు సేవలందించారు. అయితే, ఆయనను విధుల నుంచి తొలగిస్తూ 2022 నవంబరు 18న ఏయూ వీసీ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ నూకన్న 2023లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్‌ను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొనసాగించాలని నిర్ధిష్ట కాలానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో నూకన్న వీసీ ప్రసాదరెడ్డిపై కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయ మూర్తి.. ‘కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడం అధికారుల విధి. వాటికి వక్రభాష్యం చెప్పడానికి వీల్లేదు.


    కోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధంగా ఉంటే అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చు. అంతేకానీ, తప్పుడు అర్ధం చెప్పకూడదు’ అని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ప్రసాదరెడ్డి వరుసగా ఉల్లంఘిం చారని, ఇలాంటి వ్యవహారశైలి చట్టబద్ధ పాలనకు తీవ్ర ప్రతిబంధకమని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల అమలుకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, వీసీ బాధ్యతల నుంచి తప్పుకొనేవరకు ఉత్తర్వులను అమలు చేయలేదని, ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టమని స్పష్టం చేశారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement