ఐక్యమత్యంతో నవసమాజాన్ని నిర్మిద్దాం
పేదలకు, అనాథలకు సేవ చేయడమే క్రీస్తు సందేశం
* సి.ఎస్.ఐ నంద్యాల డయాసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు
* కోల్స్ కాలేజీలో కన్నుల పండువగా 'ఐక్య క్రిస్మస్' వేడుకలు
ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ, క్రైస్తవులంతా ఐక్యమత్యంతో నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని సి.ఎస్.ఐ నంద్యాల డయాసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నగరంలోని కోల్స్ మెమోరియల్ కళాశాల ఆవరణలో నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో 'ఐక్య క్రిస్మస్' వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సి.ఎస్.ఐ నంద్యాల డయాసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు, ఆర్.సి.ఎం కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 ఏళ్ల క్రితం లోక రక్షకుడిగా ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని గుర్తుచేశారు. క్రీస్తు జనన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి, సమాజంలోని పేదలు, అనాథలను ఆదుకోవాలని, సేవాతత్పరతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రేమ, దయ, సమాధానం కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్ అని సందేశం ఇచ్చారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వేడుకల్లో భాగంగా చిన్నారులు, యువతీయువకులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. షాలేమురాజు, సంగిపాగి అంతోని, సిస్టర్ వసంత, జె.సురేష్ లతో కూడిన కోయర్ బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తిభావాన్ని పెంపొందించాయి. అనంతరం ప్రత్యేక క్యాండిల్ లైట్ సర్వీస్ (కొవ్వొత్తుల ప్రదర్శన) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ కె. ప్రతాపరెడ్డి, పాస్టర్లు ఆర్.ఆర్.డి సజీవరావు, బోనాల శశికుమార్, దేవసహాయం, హోసన్నా చర్చి పాస్టర్ ప్రెడీపాల్, ఎస్టీబీసీ కాలేజి ప్రిన్సిపాల్ సునీతారోజ్, ఆర్.దాసు, దంతి రాజు, అగస్టీన్ పాల్, విల్సన్ బాబు, సదానందం, జీవన్ రావు, షాలేమురాజు, వివిధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.









Comments