• Dec 09, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం వందేమాతరంపై చర్చను చేపట్టిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  తిప్పికొట్టారు. జాతీయ గేయం బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాదన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అమిత్‌షా పాల్గొన్నారు.


    'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్‌షా అన్నారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔన్నత్యం ఉందని, 2047లోనూ ఉంటుందని చెప్పారు. వందేమాతర గేయాన్ని ఎందుకు చర్చించాలని ప్రశ్నించే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముడిపెట్టి వందేమాతరం కీర్తిని తక్కువచేసి చూపాలని కొందరు అనుకుంటున్నారని విమర్శించారు.

    వందేమాతరం గేయాన్ని రచించిన బంకిం బాబు బెంగాల్‌లో పుట్టడం నిజమని, కానీ వందేమాతరం బెంగాల్‌కో, ఇండియాకో మాత్రమే పరిమితమైంది కాదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారతీయ వీరులు ప్రపంచంలో అజ్ఞాతంగా ఎక్కడ కలిసినా వందేమాతరం అని నినదించేవారని అన్నారు. నేటికీ మన సరిహద్దుల్లో దేశ అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న మన బలగాల నోట నిరంతరం వందేమాతరం మారుమోగుతోందని అన్నారు. తరతరాలకు వందేమాతరం స్ఫూర్తినిస్తోందని, వందేమాతర గేయంపై ఉభయసభల్లోనూ చర్చ జరపడం వల్ల భవిష్యత్ తరాలవారు కూడా మన జాతీయ గేయం ప్రాధాన్యత, కీర్తిని తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.

    కాంగ్రెస్ వల్లే..

    బుజ్జగింపు రాజకీయాల కోసం వందేమాతర గేయాన్ని కాంగ్రెస్ విడగొట్టి ఉండకపోతే దేశ విభజన జరిగి ఉండేది కాదని అమిత్‌షా విమర్శించారు. వందేమాతరం 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని, దీంతో జాతీయ గేయం కీర్తిని చాటేందుకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. వందేమాతరం అంటూ నినదించిన వారిని ఇందిరాగాంధీ జైళ్లలో పెట్టించారని చెప్పారు. వందేమాతరంపై సోమవారంనాడు చర్చ జరిగినప్పుడు కూడా గాంధీ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు గైర్హాజరయ్యారని గుర్తుచేశారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇవాల్టి నాయకత్వం వరకూ వందేమాతర గేయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారని విమర్శించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement