కాశీబుగ్గలో కన్నీటి కేక — తొక్కిసలాటలో 9 మంది భక్తుల మృతి, పలువురు గాయాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మంత్రి నారా లోకేశ్ ఘటనాస్థలాన్ని సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించగా, ఇంత మంది భక్తులు వస్తారని ఊహించలేదని తెలిపారు.
గర్భగుడి పై అంతస్తులో ఉండటంతో భక్తులు 20 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. భక్తుల సంఖ్య అధికం కావడంతో మెట్లపై రెయిలింగ్ ఊడిపడటంతో భయాందోళన ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు మృతి చెందగా, ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పలాస, టెక్కలి ఆస్పత్రుల్లో చికిత్సకు తరలించారు.
ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది భక్తులు మాత్రమే వస్తారని, కానీ ఈసారి 25 వేల మంది రావడంతో దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఇంత భారీ రద్దీ ఉంటుందని ముందుగా తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడినని అన్నారు. దర్శనానికి వెళ్లే, తిరిగి వచ్చే క్యూలైన్ ఒకటే ఉండటం ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. భారీ రద్దీ సమయంలో కూడా నిర్మాణ పనులు కొనసాగించడమే ప్రమాదానికి దారి తీసిందని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను వేరు చేసి ఉంటే ఈ ఘటన నివారించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.







Comments