రాజధాని పనుల్లో వేగం పెరగాలి
అమరావతి : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు? శ్రామిక శక్తి ఏ మేరకు ఉంది? నిర్మాణాలకు అవసరమైన సామగ్రి, యంత్రాలను ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని.. ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టంచేశారు. నిర్మాణ పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా శ్రామిక శక్తి, యంత్రాలను పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఆయా సంస్థలు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
పచ్చదనం, సుందరీకరణపై రాజీపడొద్దు..
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంత వరకు పూర్తయిందనే దానిపై సీఎం ఆరా తీశారు. ఈ విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను ఆదేశించారు. ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని, ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలో రాజధాని రైతులతో సమావేశమవుతానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో.. గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. పచ్చదనం, సుందరీకరణ వంటి విషయాల్లో రాజీపడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి ప్రపంచ శ్రేణి నగరం లుక్ రావాలంటే హైరైజ్ బిల్డింగులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.







Comments