రసాయనాలతో పనిలేకుండా బయో మిథనాల్ తయారీ
గువాహటి : సాధారణ రసాయన పద్ధతులకు భిన్నంగా.. బ్యాక్టీరియా సహాయంతో బయో-మిథనాల్‌ను తయారుచేసే సరికొత్త జీవసంబంధిత విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి పరిశోధకులు దాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్‌కు చెందిన కాశ్యప్ క్లీన్టెక్ ఇన్నోవేషన్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు వారు ఉపయోగించిన బ్యాక్టీరియా.. కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. అంటే.. సూర్యరశ్మి అవసరం లేకుండా కేవలం రసాయనాలు, వాయువులను ఆహారంగా తీసుకుని జీవించే బ్యాక్టీరియా. ఇది వాతావరణంలో ఉండే/పరిశ్రమల నుంచి వెలువడే మీథేన్, కార్బన్డయాక్సైడ్ వంటి కాలుష్యకారకాలను ఆహారంగా తీసుకుని.. వాటిని తమ శరీరంలో జరిగే సహజ జీవక్రియల సాయంతో బయో మిథనాల్ అనే ద్రవ ఇంధనంగా మార్చి బయటకు విడుదల చేస్తాయి. సాధారణ పద్ధతిలో మీథేన్‌ను ఇంధనంగా మార్చాలంటే దానికి భారీగా వేడి, ఖరీదైన రసాయనాలు కావాలి. వాటి అవసరం లేకుండా ఈ బ్యాక్టీరియా మామూలు గది ఉష్ణోగ్రత వద్దే ద్రవ ఇంధనాన్ని తయారుచేస్తుంది. అంటే.. భూతాపానికి కారణమయ్యే కర్బన ఉద్గారాలను తిని, పర్యావరణానికి మేలు చేస్తే హరిత ఇంధనాన్ని ఇస్తాయన్నమాట. ఐఐటీ గౌహతిలోని బయోసైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దేవాశిష్ దాస్, కృష్ణ కల్యాణి సాహు నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఇలా తయారుచేసిన బయోమిథనాల్ను డీజిల్‌తో కలిపి.. ఆ ఇంధనాన్ని ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ గల వాహనంలో పోసి నడపగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మామూలు డీజిల్‌తో పోలిస్తే ఈ మిశ్రమ ఇంధనం కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్ సల్ఫైడ్, పొగ, ఇతర ఉద్గారాలను 87ుదాకా తగ్గించింది. పర్యావరణపరంగా, పనితీరుపరంగా గణనీయమైన ప్రయోజనాలను అందించింది.










Comments