ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా హోర్ముజ్ నుంచి వెళ్లనివ్వం: ఇరాన్
హోర్ముజ్ జలసంధి గుండా ఒక్క లీటర్ చమురును కూడా అనుమతించబోమని, బ్యారెల్ క్రూడాయిల్ ధర 200 డాలర్లు దాటుతుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో కీలకమైన హోర్ముజ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఐఆర్‌జీసీ వార్నింగ్ ఇచ్చింది.
'అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు సంబంధించిన ఏ నౌకను అయినా చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణిస్తాం. హోర్ముజ్ గుండా ఒక్క లీటర్ చమురును కూడా అనుమతించం. మీరు చమురు ధరను కృత్రిమంగా తగ్గించలేరు. బ్యారెల్‌కు 200 డాలర్లు చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. చమురు ధర ప్రాంతీయ భద్రతపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో అభద్రతకు మీరే (అమెరికా, ఇజ్రాయెల్) మూల కారణం' అని ఐఆర్‌జీసీ పేర్కొంది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకలను డ్రోన్లు, సీ మైన్స్ ద్వారా ఇరాన్ పేల్చేస్తోంది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు గత వారం విపరీతంగా ఆటుపోట్లకు గురయ్యాయి. ప్రపంచంలోని చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి మూతపడడం, కొన్ని గల్ఫ్ దేశాలలో చమురు ఉత్పత్తి తగ్గిపోవడం ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే చైనా, భారత్ వంటి దేశాలతో పాటు యూరప్ కూడా భారీ ఇంధన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.










Comments