గంగోత్రి టూ రామేశ్వరం!
చింతూరు : విశ్వకల్యాణమే తన ఆకాంక్ష అంటూ ఓ సాధువు సాష్టాంగ ప్రమాణాలతో రామేశ్వరంలోని రంగనాథస్వామి ఆలయానికి బయలుదేరారు. అత్యంత క్లిష్టతరమైన ఈ ప్రయాణం ఎక్కడా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక థర్మాకోల్ రోడ్డుపై పరుస్తూ.. ఒక్కొక్కటిగా సాష్టాంగ ప్రమాణం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి కూడలి వద్ద ఆయన కొద్దిసేపు సేదతీరారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘నా పేరు ఉపేంద్ర దాస్. మాది ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి. విశ్వకల్యాణమే నా ఆకాంక్ష. అందుకే గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నాను. 3,300 కి.మీ. సాగే నా ప్రయాణం మంగళవారం నాటికి 3 నెలల పూర్తయ్యా యి. రోజుకు 20 కిలోమీటర్ల వరకు వెళ్లగలుగుతున్నాను. ఇది కష్టమైన సాధనే అయినప్పటికీ.. ఆ శివయ్యే నాకు మార్గం చూపుతున్నాడు’ అని తెలిపారు. కాగా, యాత్ర పొడుగునా తనకు ఓ మనిషి సాయంగా వస్తున్నారని, రాత్రి సమయంలో మాత్రమే తాను సొంతంగా భోజనం తయారు చేసుకుని భుజిస్తున్నానని తెలిపారు.









Comments