విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్ రికార్డ్
అమరావతి : విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో జీవితకాల రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్, ఇంధన శాఖల మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వ్యాఖ్యానించారు. 6101 మెగావాట్లతో జీవితకాల రికార్డు స్థాయిలో ఏపీ జెన్కో ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని ఉద్ఘాటించారు.
నైపుణ్యం, కృషితోనే ఈ రికార్డు..
ఇంజినీర్లు, అధికారుల అంకితభావం, నైపుణ్యం, కృషితోనే ఈ రికార్డు నమోదైందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వేసవి విద్యుత్ డిమాండ్ అందుకునేందుకు అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం కీలకమని చెప్పుకొచ్చారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నిరంతరాయ విద్యుత్ సరఫరాయే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు వైసీపీ హయాంలో ఏపీ జెన్కోని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో అడ్డగోలుగా తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్లు భారం వేశారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.








Comments