అరటికు డిమాండ్.. పెరిగిన ధరలు
కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టన్ను రూ.9,500 నుంచి రూ.16,500 వరకు పలుకుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
పులివెందుల : పులివెందుల నియోజకవర్గం అరటికి పెట్టింది పేరు. చక్రాయపేట మండలం మినహా మిగిలిన ఆరు మండలాల్లో అరటి విరివిగా సాగుచేశారు. దాదాపు రూ.25వేల ఎకరాల్లో అరటి సాగులో ఉంది. గత మూడు నెలలుగా అరటి ధరలు పతనమయ్యాయి. టన్ను రూ.2వేల నుంచి రూ.6వేలు మాత్రమే పలికింది. ఒకానొక సందర్భంలో ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు రాక పోవడంతో స్థానిక మార్కెట్‌కు అమ్మేందుకు రైతులు సిద్ధపడినా టన్ను అరటి రూ.2వేలతో కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాలేదు. అరటి గెలలు పక్వానికి వచ్చి తోటల్లోనే మాగిపోతుంటే వాటిని చూసి రైతులు కంటతడి పెట్టాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నాలుగైదు రోజులుగా మారింది. పులివెందులకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు, లారీలు వస్తుండడంతో రైతుల్లో కొంత ధైర్యం వచ్చింది.
క్రమంగా పెరుగుతున్న ధరలు
పులివెందుల అరటి అంటే ఇతర రాష్ట్రాల్లో, అరబ్‌దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పండే అరటి 8 రోజుల నుంచి 10రోజులు మాత్రమే నిల్వ ఉంటుందని, పులివెందుల అరటి మాత్రం 12 నుంచి 14రోజుల వరకు నిల్వ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. దీని కారణంగా పులివెందుల అరటికి డిమాండ్ ఉంది.
ప్రతి ఏడాది డిసెంబరు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పులివెందులకు వచ్చి వ్యాపారాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది కూడా పదిరోజులు ఆలస్యమైనా ఇతర రాష్ట్రాల వ్యాపారులు పులివెందులకు వస్తున్నారు. దీనితో ఐదు రోజుల కిందటి వరకు టన్ను రూ.5వేలు రూ.6వేలు పలికిన అరటి క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాణ్యతను బట్టి ప్రస్తుతం రూ.9,500 నుంచి రూ.16,500 వరకు పలుకుతోంది.
పలు ప్రాంతాలకు ఎగుమతులు
పులివెందుల అరటిని నాలుగైదు రోజులుగా యూపీ, శ్రీనగర్, జమ్మూ, కలకత్తాతో పాటు అరబ్ దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులు వస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు అరబ్‌దేశాలకు ఎగుమతులు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి, అరబ్‌దేశాల నుంచి ఆర్డర్లు విరివిగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు.
ఇక నుంచి రోజురోజుకు అరటి ధరలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. గత రెండు రోజులుగా పులివెందులలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు తమ అరటిని కొనుగోలు చేయాలని వ్యాపారుల వద్దకు రైతులు ప్రదక్షిణలు చేశారు. వ్యాపారులు అప్పుడు ముందుకు రాలేదు. ఇప్పుడు రేట్లు పెరుగుతుండటంతో తోటల వద్దకు వ్యాపారులు వచ్చినా.. మరికొన్ని రోజులు వేచి చూస్తామని రైతులు చెబుతున్నారు. ఏదిఏమైనా అరటి రైతుల కష్టాలు కొంతవరకు గట్టెక్కినట్టే అని అంటున్నారు.










Comments