పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
కళ్యాణదుర్గం : ఓ యువకుడి ఆత్మహత్యను పరువు హత్య అని ఆరోపించిన అనంతపురం జిల్లా వైసీపీ నేత, మాజీ ఎంపీ తలారి రంగయ్యకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలను చూపించి, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్ (21) గత నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రానికారణంగా తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆనంద్ తండ్రి వెంకటేశులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్య అని తలారి రంగయ్య ఆరోపించారు. దీంతో పోలీసులు స్పందించారు. ఆధారాలు చూపాలంటూ పట్టణ సీఐ హరినాథ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 2న పోలీసులు రంగయ్యకు నేరుగా నోటీసులు అందించేందుకు వెళ్లగా, ఆయన తిరస్కరించడంతో ఇంటి గోడకు అతికించారు. తర్వాత ఆయన పోలీసులకు ఫోన్లో వివరణ ఇచ్చారు. దీనిపై పోలీసులు సంతృప్తి చెందకపోవడంతో మరోమారు ఈనెల 7న నోటీసులు అందించారు.










Comments