బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..
అనంతపురం : మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకులో బంగారు ఆభరణాల్లో లక్క ఉంచి, తూకం ఎక్కువగా చూపించి అధిక మొత్తంలో రుణం తీసుకుని, మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. డబురువారిపల్లికి చెందిన అందె జయప్పతోపాటు అదే ఊరికి చెందిన ముస్తాక్ బాషా, రఘుకుమార్, నగేష్ కొన్నేళ్ల క్రితం బెంగళూరు కు వెళ్లి స్థిరపడ్డారు. తమ వద్దనున్న తక్కువ బంగారంతో ఎక్కువ రుణం పొందాలనుకున్నారు. ఆభరణాల్లో లక్కను ఉంచి తూకం ఎక్కువ వచ్చేలా ఎత్తుగడ వేశారు.
అలా.. గోరంట్లలోని ఎస్‌బీఐ శాఖలో తాకట్టు పెట్టి అధిక మొత్తంలో రుణం తీసుకున్నారు. అది కూడా గ్రామానికి చెందిన రైతుల పేర్లతో తీసుకున్నారు. రెండోసారి బంగారు రుణం కోసం వెళ్లగా.. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పరిశీలించారు. దీంతో మోసం వెలుగుచూసింది. దీనిపై బ్యాంకు మేనేజర్ యేసుదాసు.. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం మండలంలోని మహమ్మదాబాద్ క్రాస్‌లో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.










Comments