• Jun 25, 2026
  • NPN Log

    కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి చాలా కాలం ముందు నుంచే జనంతో ఆయన మమేకమయ్యారు. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లో మార్పునకు 2026 ఎన్నికల్లో పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అఖండ విజయం సాధించి పెట్టిన 'అన్‌సంగ్ హీరో'లలో ఒకరుగా నిలిచారు. ఆయనే మిథున్ దా.. అలియాస్ మిథున్ చక్రవర్తి. '2026లో కిరీటం మనదే (బీజేపీ). ఆ లక్ష్య సాధనకు ఏమి చేయలో అది చేసి తీరుతాం' అని మిథున్ చక్రవర్తి 2024లోనే ప్రకటించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ హవా కొనసాగి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మిథున్ మాత్రం 2026లో అధికారం మనదేనంటూ జోస్యం చెప్పారు. పార్టీని అట్టడుగు వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన చెప్పినట్టు టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ప్రజలు ఇటీవల ఉద్వాసన పలికారు. బెంగాల్‌లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2026 ప్రచారం యావత్తు టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు. ప్రధాని మోదీ ఇమేజ్ చుట్టూనే తిరిగింది. ఇదే సమయంలో మిథున్ చక్రవర్తి ఇమేజ్ పలు రకాలుగా పార్టీ విజయానికి ఊతమిచ్చింది. 1980, 1990 దశకంలో ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన యువత మిథున్‌ను 'మహానాయక్‌'తో సరిపోలుస్తూ ఆయన పట్ల విశేష ఆదరణ కనబరిచారు. బెంగాల్‌లో సినిమా, రాజకీయాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. బీజేపీ విజయానంతరం ప్రధాని మోదీ అభినందనలను మిథున్ అందుకున్నారు. మోదీ, మిథున్ పక్కపక్కనే కనిపించడం, మిథున్‌తో ప్రధాని ఆప్యాయంగా ముచ్చటించి, కరచాలనం చేయడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

    మిథున్‌కు ఆర్ఎస్ఎస్‌తోనూ చిరకాల అనుబంధం ఉంది. 2019లో ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌ను నాగపూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో తన ముంబై నివాసంలో మోహన్ భాగవత్‌కు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌ దశాబ్దాలుగా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు సాగించినా సింగిల్ డిజిట్ సీట్లు సాధించడం కూడా కష్టంగా ఉండేది. ఈ తరుణంలో మిథున్‌ను పార్టీ వైపు రావాల్సిందిగా బీజేపీ కోరింది. పూర్తి స్థాయిలో ప్రచారం సాగించే వీలులేకుంటే సెలబ్రిటీ ఫేస్‌గా జనంలోకి పార్టీ తరఫున వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మిథున్ తన గళం బలంగా వినిపించారు. మిథున్ చక్రవర్తి ఒంట్లో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకూ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్ కానీయమంటూ ఆయన ప్రచారం సాగించారు.

    కోల్‌కతాలోని 1950లో గౌరాంగ చక్రవర్తి (మిథున్ చక్రవర్తి) జన్మించారు. 1960, 70 దశకాల్లో అప్పటి బెంగాలీ యువతరం తరహాలోనే ఆయన కూడా నక్సలైట్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. రాడికల్ లెఫ్ట్ రాజకీయాల వైపు మళ్లారు. అయితే ఆయన సోదరుడు ఒక ప్రమాదంలో మరణించినప్పటి నుంచి నక్సల్స్ ప్రపంచానికి మిథున్ దూరమై.. సినిమాల వైపు దృష్టిసారించారు. పుణెలోని ఎఫ్‌టీఐఐలో శిక్షణ తీసుకుని ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ 'మృగయా' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గిరిజన హంటర్‌గా ఆందులో చేసిన పాత్రకు గాను ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తొలినాళ్లలో ఆయన ధరించిన పాత్రలు ప్రభుత్వాలను నిలదీసే తరహాలో ఉండేవి. ఆ తరువాత సమాంతర సినిమా నుంచి క్రమంగా మాస్ స్టార్‌డమ్ వైపు ఆయన ప్రయాణం సాగింది. 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' చిత్రం యువతను ఉర్రూతలూగించింది. ఇండియాలోనే కాకుండా సోవియట్ యూనియన్, ఈస్ట్రన్ యూరప్‌లోని పలు చోట్ల పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు ప్రజాదరణ పొంది 2024లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాయి.

    చాలామంది స్టార్‌ల మాదిరిగా మిథున్ ఇమేజ్ మెట్రోపాలిటన్ ఆడియెన్స్‌ మాత్రమే పరిమితం కాకుండా యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్‌లోని చిన్న పట్టణాలు, శ్రామిక వర్గాలు నివసించే ప్రాంతాలకు విస్తరించి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మిథున్ చక్రవర్తి రాజకీయ జీవితం సైద్ధాంతిక పరంగా చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. 2014 తృణమూల్ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యునిగా ఆయన్ను మమతాబెనర్జీ నామినేట్ చేశారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ, ప్రణబ్‌ ముఖర్జీ మధ్య మధ్యవర్తిత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు కూడా చెబుతారు. 2021కి వచ్చేసరికి బెంగాల్ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నిలిచింది. ఆ క్రమంలో ప్రధానమంత్రి మోదీ కోల్‌కతాలో పాల్గొన్న భారీ ర్యాలీలో మిథున్ చక్రవర్తి ఆ పార్టీలో చేరారు. ఒక దశలో మిథున్ సీఎం కావాలని ఆశించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. 2023లో కోల్‌కతాలో జరిగిన ఏబీవీపీ సమావేశానికి హాజరైనప్పుడు తాను సీఎం అయితే ఆరు నెలల్లో పశ్చిమబెంగాల్‌లో మార్పు తీసుకువస్తానని ప్రకటించారు.

    బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా ఆ రాష్ట్రంతో మిథున్‌కు ఎంతో అనుబంధం ఉంది. గత ఎన్నికల ప్రచారాల్లో బెంగాల్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, తనకున్న సినీ ఇమేజ్‌తో బీజేపీ ప్రచారానికి ఆయన ఊపునిచ్చేవారు. ఆయన ప్రసంగాల్లో తన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్‌లు చెప్పడం ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకునే వారు. టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక వ్యక్తిగా మారారు. 2026లో వయస్సు రీత్యా మునుపటిలా ప్రచారం తీవ్రంగా చేయలేకపోయినా ప్రజలతో మమేకమై వారిలో ఉత్సాహాన్ని నింపారు. బెల్గాచియాలో ఓటు వేయడానికి వచ్చినప్పుడు బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం తర్వాత పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడినప్పటికీ మిథున్ పార్టీ పట్ల తనకున్న విధేయతను చాటుకుంటూ వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రమైన అక్రమ వలసల నిరోధాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. బెంగాల్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించడానికి పనిచేసిన 'సైలెంట్ హీరో'లలో ఒకరుగా నిలిచారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement