అనాటమీ మృతదేహాలపై అభ్యంతకర వ్యాఖ్యలు
గుంటూరు : అనాటమీ డిసెక్షన్ రూమ్‌లో వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం ఉపయోగించే పురుష మృతదేహాల (కెడావర్స్)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మండిపడింది. మానవ శరీర నిర్మాణంపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించే కెడావర్స్ను కించపరిచేలా, మృతదేహాల దాతల కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బలగం దినకర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ రవితేజ నాయక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ భార్గవ సాయి నాయుడు ఖండించారు. ఇవి కేవలం మృతదేహాలు కాదని.. వైద్య విద్యార్థులకు విలువైన పాఠాలు బోధించే నిశ్శబ్ధ ఉపాధ్యాయులని వారు పేర్కొన్నారు. ఈ షో నిర్వాహాకులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ప్రణీత్ మోరే కామెడీ షోలో పురుష మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన యువతి ఎంబీబీఎస్ విద్యార్థిని కావడం గమనార్హం. ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారి విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె భేషరతుగా క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల పట్ల వివిధ రాష్ట్రాల్లో వైద్య విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.










Comments