భారత సిబ్బంది నౌకపై దాడి అవాస్తవం: కేంద్ర విదేశాంగ శాఖ
ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులు ఉన్న నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించారు. తాజాగా ఒమన్ తీర ప్రాంతంలోనే ఇండియన్స్ ఉన్న మరో నౌకపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. మార్షల్ ఐలాండ్ జెండా ఉన్న లియాకి ఫ్రీడమ్ నౌకపై దాడి జరిగిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ ఖండించింది.
లియాకి ఫ్రీడమ్ నౌకపై దాడి జరగలేదని, అందులోని భారతీయులు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. తమ వర్గాలు లియాకి ఫ్రీడమ్ నౌక కెప్టెన్‌ను సంప్రదించి వివరాలు సేకరించినట్లు తెలిపింది. నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, దాడి వార్తలు అవాస్తవమని కెప్టెన్ చెప్పారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 'మేము లియాకి ఫ్రీడమ్ నౌక కెప్టెన్‌తో మాట్లాడాము. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని , దాడి జరిగిందనే వార్త అవాస్తవమని ఆయన ధ్రువీకరించాడు' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వర్గాలు మీడియాకు తెలిపాయి.
గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంటీ జల్వీర్ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం దాడి చేసిన రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎంటీ జల్వీర్ నౌకపై దాడి జరిగిన సమయంలో అందులో మొత్తం 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇటీవల ఒమన్ ప్రాంతంలో చమురు నౌకలపై జరుగుతున్న దాడులు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలో ఒమన్ తీర ప్రాంతంలో మూడు నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి.










Comments