• Jun 13, 2026
  • NPN Log

    విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల పేరిట కొందరు ఉద్యోగులు రూ.లక్షలు దండుకున్నారు. అటెండర్‌, రికార్డు అసిస్టెంట్‌ పోస్టులకు రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ డిమాండ్‌ చేసి, 25 మంది వద్ద తొలి వాయిదా కింద రూ.లక్ష, మరికొందరి వద్ద రూ.2.5 లక్షలు తీసుకున్నారు. డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఒత్తిడి చేస్తుండటంతో వారికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చారు. ఆ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లపై అనుమానం వచ్చిన కొందరు వర్సిటీలో తమకు తెలిసిన ఉద్యోగులకు చూపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అభ్యర్థులు తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు వర్సిటీ ఉద్యోగులు కీలక పాత్రధారులు కాగా, బయటి వ్యక్తులు కొందరు దళారులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏయూలో పనిచేస్తూ, గత వైసీపీ హయాంలో యూనియన్‌ నాయకులుగా చెలామణి అయిన వారిలో ఇద్దరు, మరో సీనియర్‌ అసిస్టెంట్‌ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లపై వర్సిటీ ఉన్నతాధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని, దీన్ని సీరియ్‌సగా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని, నోటిఫికేషన్‌ లేకుండా ఉద్యోగాల నియామక ప్రక్రియ జరగదని రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement