కెనరా బ్యాంక్ లాభం రూ.4,856 కోట్లు
బెంగళూరు : ప్రభు త్వ రంగంలోని కెనరా బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.4,752 కోట్లు)తో పోల్చితే లాభం 2 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.38,063 కోట్ల నుంచి రూ.39,684 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ బ్రజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. వడ్డీ ఆదాయం కూడా రూ.31,003 కోట్ల నుంచి రూ.32,957 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) తొలిసారిగా రూ.10,000 కోట్లు దాటిందని సింగ్ తెలిపారు. ఈ కాలంలో ఎన్‌ఐఐ 13 శాతం వృద్ధితో రూ.9,009 కోట్ల నుంచి రూ.10,215 కోట్లకు చేరుకుందని వివరించారు.
త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.69 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయని తెలిపారు. జూన్ త్రైమాసికంలో రూ.2,500 కోట్లు రికవరీ చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.1,845 కోట్ల నుంచి రూ.1,399 కోట్లకు తగ్గినట్లు ఆయన తెలిపారు. ప్రొవిజన్ కవరేజీ రేషియో (పీసీఆర్) 93.17 శాతం నుంచి 94.76 శాతానికి చేరుకుందన్నారు. కాగా బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ 14 శాతం వృద్ధి చెంది రూ.29,05,066 కోట్లకు చేరుకోగా మొత్తం డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.16,11,685 కోట్లకు చేరుకున్నాయని సింగ్ తెలిపారు.







Comments