• Apr 21, 2026
  • NPN Log

    క్రికెట్ ప్రపంచంలో మరో కలకలం రేగింది. పవిత్రమైన క్రీడగా భావించే క్రికెట్‌లో మాఫియా అడుగుపెట్టిందన్న వార్త క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా సాగుతున్న ఈ కుంభకోణంలో కెనడా జాతీయ జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ విస్తుపోయే విషయం ఏమిటంటే… ఈ ఫిక్సింగ్ వెనుక భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా హస్తం ఉందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఇప్పటికే రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేసింది.

    ఫిక్సింగ్ వెనుక భయంకరమైన కథ

    కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కథనం ప్రకారం.. జూలై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన ఈ కుంభకోణానికి పునాది వేసింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా జాతీయ జట్టు స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారట. దిల్‌ప్రీత్ బజ్వాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా, అతన్ని కెప్టెన్‌గా నియమించడానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. గన్‌ పాయింట్‌ బ్లాకులో పెట్టి బెదిరించి జట్టు కెప్టెన్‌ను మార్చడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు.

    వివాదాస్పద ఓవర్.. ఐసీసీ రంగప్రవేశం

    న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా బౌలింగ్ చేసిన ఒక ఓవర్ విపరీతమైన అనుమానాలకు తావిచ్చింది. ఆ ఓవర్‌లో అతను అనూహ్యంగా పరుగులు ఇచ్చుకోవడం, బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఐసీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందన్న బలమైన అనుమానంతో బజ్వా మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి, అతనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్లతో అతనికి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. జైలులో ఉంటూనే నెట్‌వర్క్ నడిపే బిష్ణోయ్, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మాఫియాలోకి కూడా ప్రవేశించాడని రిపోర్టులు చెబుతున్నాయి.

    బోర్డు మెంబర్ల ప్రమేయం?

    కేవలం ఆటగాళ్లే కాకుండా, క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసా కూడా ఈ ముఠాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దిల్‌ప్రీత్ బజ్వాను కెప్టెన్ చేయడంలో ఖోసా కీలక పాత్ర పోషించారని, ఇది కేవలం మ్యాచ్‌లు ఫిక్స్ చేసి డబ్బు సంపాదించడానికే అని కొందరు బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఖోసా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదంతా తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు, మాజీ కోచ్ ఖుర్రం చోహన్ కూడా గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నట్లు పేర్కొనడం సంచలనం రేపుతోంది.

    కెనడాలో టెర్రర్ ముఠాగా బిష్ణోయ్ గ్యాంగ్

    కెనడా ప్రభుత్వం ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా అక్కడ హత్యలు, వసూళ్లు, కాల్పులకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి దృష్టి క్రికెట్‌పై పడటం ఆటగాళ్ల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇస్తే తప్ప, ఇది ఎంత దూరం విస్తరించిందో తెలియదు. ప్రస్తుతానికైతే వరల్డ్ కప్ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు క్రికెట్ పరువును గంగలో కలిపేలా ఉన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement