• Apr 03, 2026
  • NPN Log

    ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. చైనా స్టార్టప్ సంస్థ స్పేస్ పయనీర్‌కు చెందిన టియాన్‌లాంగ్-3 రాకెట్ గాల్లోకి లేచిన కొన్ని సెకన్లకే పేలిపోయింది. గోబీ ఎడారిలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.17 సమయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

    ఈ ఘటనపై స్పేస్ పయనీర్ సంస్థ తమ పెట్టుబడిదారులకు క్షమాపణలు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఘటనకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. స్పేస్ ఎక్స్‌‌కు చెందిన పునర్ వినియోగ రాకెట్ ఫాల్కన్-9తో పోటీ పడేలా టియాన్‌లాంగ్-3ను స్పేస్ పయనీర్ రూపొందించింది. ఒక రాకెట్‌ను కనీసం పది ప్రయోగాలకు వినియోగించుకునేలా రూపొందించారు. ఈ రాకెట్‌ ఒకేసారి 36 శాటిలైట్స్‌ను కక్ష్యలోకి మోసుకుపోగలదు.

     

    శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం భారీ సంఖ్యలో కియాన్‌ఫాన్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అక్కడి మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ చైనా 108 కియాన్‌ఫాన్ శాటిలైట్‌లను కక్ష్యలోకి పంపింది. వచ్చే ఏడాది చివరి నాటికి 1300 శాటిలైట్‌లను, 2030 నాటికల్లా 15 వేల శాటిలైట్‌లను ప్రయోగించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా టియాన్‌లాంగ్-3 అభివృద్ధిపై స్పేస్ పయనీర్ దృష్టిపెట్టింది. ఇక ఫాల్కన్-9 రాకెట్ సాయంతో స్టార్‌లింక్ ఇప్పటికే వేల సంఖ్యలో బ్రాడ్‌బాండ్ శాటిలైట్‌లను విజయవంతంగా ప్రయోగించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement