జగన్ పీఏ అక్రమ సొమ్ము విదేశాలకు?
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్ఆర్) వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు సిట్ విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఆయన ఆస్తులు ఇప్పటి వరకూ మూడు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. అక్రమ సొమ్మును విదేశాలకు కూడా తరలించి పెట్టుబడులు పెట్టినట్టు తాజా విచారణలో వెలుగు చూసింది. కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన కేఎన్ఆర్ చిన్ననాటి స్నేహితుడు, తాను అరెస్టైతే తన స్థానంలో జగన్‌కు సేవలందించేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా తాడేపల్లికి తెచ్చి పెట్టుకున్న పుత్తా శివశంకర్ రెడ్డి (పీఎస్ఆర్)ని సిట్ అధికారులు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రశ్నించారు. కేఎన్ఆర్ ఆర్థిక వ్యవహారాలు తనకు తెలియవంటూ మొదట్లో చాలా జాగ్రత్తగా అతడు చెప్పాడు. అయితే సిట్ అధికారులు మధ్యలో చాకచక్యంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు విదేశీ పెట్టుబడులపై నోరు జారినట్లు తెలిసింది. విదేశాల్లో బంధువుల పేరుతో కేఎన్ఆర్ పెట్టుబడులు, దుబాయ్ మీదుగా యూఎస్‌లో సాఫ్ట్వేర్ కంపెనీకి సొమ్ములు చేరడంపై చూచాయగా చెప్పినట్లు తెలిసింది.
కేఎన్ఆర్ను అరెస్టు చేస్తే జగన్ సేవకు పీఎస్ఆర్
లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు జగన్ పీఏ కేఎన్ఆర్ను అరెస్టు చేస్తే.. ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో చేసే పనులన్నీ తాను చేసేందుకు సిద్ధమైనట్లు పుత్తా శివశంకర్ రెడ్డి వెల్లడించినట్లు తెలిసింది. ఒకే ఊరిలో పుట్టిపెరిగిన కేఎన్ఆర్, పీఎస్ఆర్ మంచి స్నేహితులు. సిట్ అధికారులు తనకు నోటీసు ఇచ్చిన రోజే తాడేపల్లిలో సజ్జల రామకృష్ణా రెడ్డి సహా మరికొందరు ముఖ్యులతో సమావేశమయ్యాడు. జగన్ వద్దకు శంకర్ రెడ్డిని సెట్ చేద్దామని అప్పుడే నిర్ధ్దారణకు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పార్టీ నేతలతో జగన్ సమావేశమైనప్పుడు సీట్లో టవల్ సర్ది జగన్ చేతికి వాటర్ బాటిల్ అందించింది శంకర్ రెడ్డేనని సిట్ చూసిన విజువల్స్‌లో కనిపించింది. ఆస్తుల గుట్టు బయటపడేలోపు జగన్‌ను వదిలేసి కేఎన్ఆర్ విదేశాలకు వెళ్లిపోయే పథక రచన ఏమైనా చేశాడా అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. జగన్ పీఏతో తనకు ఎలాంటి ఆర్థిక లవాదేవీలు లేవని చెప్పిన పీఎస్ఆర్ను లావాదేవీల రికార్డులతో ఆడిటర్‌ను వెంట తీసుకురావాలంటూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు శుక్రవారం విచారణకు హాజరు కాని లక్కీ హ్యుందాయ్ కార్ల షోరూమ్ భాగస్వామిని సైతం ఆడిటర్‌తో కలిసి రావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.









Comments