జనంలోకి ఇరాన్ టాప్ లీడర్లు.. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి..
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు. దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఎటువంటి భద్రతా ఏర్పాట్లూ లేకుండా ఈ ఇద్దరూ జనసమూహంలో తిరిగారు. ప్రజలతో మమేకమై ర్యాలీలో పాల్గొన్నవారితో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.
అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అరాగ్చీ జనసమూహంతో మమేకమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనకారులతో ఎందుకు కలిశారనే ప్రశ్నకు అరాగ్చీ స్పందిస్తూ.. 'క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొందేందుకు, ప్రజా సమైక్యతను ఆస్వాదించేందుకు వారి మధ్యకు వచ్చాన'ని అన్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి, ఇరాన్ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీతో సహా పలువురు అగ్రశ్రేణి ఇరాన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే
ఈ ర్యాలీ తర్వాత యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో మసూద్ పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు (Iran guarantees demand). భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే హామీ ఇస్తే, యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో కోస్టాతో చెప్పారు. మరోవైపు అమెరికాకు చెందిన రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో తాను ప్రత్యక్ష చర్చలు జరిపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ అంగీకరించారు.









Comments