డైటీషియన్ పోస్టులకు మోక్షమెప్పుడు?
హైదరాబాద్ : ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యంతోపాటు మంచి ఆహారం అందివ్వటం కూడా చాలాముఖ్యం. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచించే బాధ్యత డైటీషిన్ది. రోగి త్వరగా కోలుకోవటంతో డైటీషియన్ పాత్ర చాలా కీలకం. కానీ, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషిన్లు కరువయ్యారు. 42 డైటీషియన్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. వీటిని పదోన్నతుల ద్వారా భర్తీచేస్తారు. ఏడాది కాలంగా రెండుసార్లు పదోన్నతులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టులు ప్రకటించినా.. ఇప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. డీఎంఈ పరిధిలో డైటీషియన్స్, బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు సంబంధించిన పదోన్నతులుంటాయి. ఇందులో లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, బయోకెమిస్టు పోస్టుల పదోన్నతులు గతేడాది ఇచ్చేశారు. డైటీషియన్ పదోన్నతులకు కూడా ఆ సమయంలోనే 54 మందితో ప్రొవిజనల్ జాబితా విడుదల చేశారు. కానీ, విద్యార్హతల విషయంలో అనేక కొర్రీలు పెట్టి పదోన్నతులు నిలిపివేశారు. అనంతరం అశావహులు డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్‌ను కలసి విన్నవించటంతో ప్రమోషన్లు ఇవ్వాలని కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు.
దీంతో ఈ ఏడాది కూడా 51 మందితో ప్రొవిజనల్ జాబితాను విడుదల చేశారు. మల్టీజోన్ 1లో 20 పోస్టులకు 31 మంది, మల్టీజోన్ 2లో 22 పోస్టులకు 20 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. 20 రోజుల క్రితం అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించారు. అయితే.. జేడీ, డీడీలు బిజీగా ఉండి ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో పాల్గొనలేదు. ఇతర అధికారులే ఆ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. దీంతో తాము పరిశీలించకుండానే వెరిఫికేషన్ ఎలా చేస్తారని డీడీ కొర్రీ పెట్టారు. మళ్లీ వెరిఫికేషన్ చేస్తామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు చేయనేలేదు. డీఎంఈ పరిధిలో 35 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులున్నాయి. అలాగే హైదరాబాద్‌లో నిలోఫర్, ఛాతీ, మానసిక వైద్యశాల, పేట్లబుర్జు లాంటి దవాఖానాలు కూడా డీఎంఈ పరిధిలోకే వస్తాయి. బోధనాస్పత్రుల్లో విఽధిగా డైటీషియన్లు ఉండాలి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భర్తీ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారి పదోన్నతులు కల్పించారు. బోధనాస్పత్రుల్లో డైటీషియన్లు లేకపోవటంతో డైట్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.










Comments