• Jul 28, 2026
  • NPN Log

    అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే బలవర్ధక ఆహారం బాలామృతం. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించి తయారు చేసే బాలామృతం ద్వారా విటమిన్‌ లోపాలు, రక్త హీనత నివారించాలన్నది ప్రధాన లక్ష్యం. అయితే, రాష్ట్ర విభజన జరిగి దశాబ్దానికిపైగా గడిచినా ఏపీలో బాలామృతం తయారీ ప్లాంట్‌ ఏర్పాటు కాలేదు. దీంతో ప్రతి నెలా వేల టన్నుల బాలామృతాన్ని తెలంగాణ నుంచి సేకరించాల్సి వస్తోంది. అయితే, స్థానికంగా ఏపీలో ఉత్పత్తి ప్రారంభిస్తే పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతోపాటు యువతకు ఉపాధి, సరఫరాలో స్వయంసమృద్ధి లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

    గడప దాటని టెండర్లు

    రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి బాలామృతం ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2025లోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో 2025, డిసెంబరులో టెండర్లు పిలిచినప్పటికీ, ఏపీ హైక్టోరు మధ్యంతర ఆదేశాల కారణంగా తుది నిర్ణయం నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు రిట్‌ పిటిషన్‌ను కొట్టి వేసి, టెండర్ల ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. అయినప్పటికీ, మహిళా శిశు సంక్షేమశాఖ ఈ విషయాన్ని తేలికగా తీసుకుంది.

    పరిపాలనా స్థాయిలో వేగంగా నిర్ణయం తీసుకోకపోవడంతో బాలామృతం తయారీ ప్లాంట్ల ఏర్పాటు కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్రంలోనే బాలామృతం తయారీ ప్రారంభమైతే అంగన్వాడీలకు నిరంతరం సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రవాణా, నిల్వ వ్యయాలు తగ్గే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు అంతరాయం తగుతుంది.

    లక్షలాది మందికి ఆధారం

    రాష్ట్రంలోని 50 వేలపైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసున్న చిన్నారులకు, గర్భిణిలు, బాలింతలకు ప్రభుత్వం పౌష్ఠికాహారం అందిస్తోంది. దీనిలో బాలామృతం అంత్యంత కీలకం. పోషకాహార లోపాన్ని తగ్గించడం, పిల్లల ఎదుగుదల మెరుగుపరచడం, రక్తహీనతను నివారించడం వంటి లక్ష్యాలతో దీనిని పంపిణీ చేస్తున్నారు.

    కోర్టు కేసు వల్లే జాప్యం

    బాలామృతం ప్లాంటు ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, కొంత మంది కోర్టులో కేసు వేయడం వల్ల ప్రక్రియలో జాప్యం జరిగిందని మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. హైకోర్టు రిట్‌ పిటిషన్‌ కొట్టివేయడంతో టెండర్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభించామన్నారు. టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేశామని, ఫైనాన్షియల్‌ బిడ్లు కూడా త్వరలో ఓపెన్‌ చేసి ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పాలనాపరమైన ఆలస్యం జరగలేదన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).