• Jul 28, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : బండ్లగూడ మండలం కందికల్‌ గ్రామంలోని 31.25 ఎకరాల భూమికి సంబంధించిన 30 ఏళ్లనాటి భూవివాదాన్ని తిరిగి సివిల్‌ కోర్టులోనే తేల్చుకోవాలని సోమవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ వివాదాస్పద భూమిని ప్రభుత్వ నిధులతో సేకరించి ఆక్రమణదారులకు ఇవ్వాలన్న హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ తొలుత1995లో సుల్తాన్‌ మోహియుద్దీన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆ ప్రత్యేక కోర్టు 645 మందిని ఆక్రమణదారులుగా నిర్థారిస్తూ 1997లో తీర్పు ఇచ్చింది. ఆక్రమణదారులు ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీలు చేయగా ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ 2009లో హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. అయితే ఆక్రమణదారులు ఆ భూమిలో ఉన్న 1,000ఇళ్లను తొలగించాలంటే రూ.48లక్షలు ఖర్చవుతుందని 2010లో తహసీల్దార్‌ నివేదిక ఇచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో బాధితుడి కుమారులు 2019లో మళ్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు రెండు నెలల్లో ఆక్రమణలు తొలగించాలని, లేదంటే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని 2025లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 16న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై సోమవారం జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టి, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాల ధర్మాసనం విచారణ జరిపింది. ఒక ప్రైవేట్‌ భూమి కోసం ప్రజాధనాన్ని వాడటం సరికాదని తెలిపారు. ప్రైవేట్‌ వ్యక్తుల భూవివాదంలో ప్రభుత్వ నిధులతో భూసేకరణ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. దానిని నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. సంబంధిత డిక్రీల అమలుకు మళ్లీ సివిల్‌కోర్టునే ఆశ్రయించాలని తెలిపింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).