మత్తిచ్చి.. ఊపిరాడకుండా చేసి..!
పాలకొండ : తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన ప్రియురాలిని మరో ప్రియురాలి సాయంతో ఓ యువకుడు హత్య చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం పాలకొండ పోలీసుస్టేషన్‌లో ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఎం.సింగుపురానికి చెందిన రెడ్డి భువనేశ్వర్ అనే యువకుడికి.. బర్న సీతంపేటకు చెందిన బిడ్డిక ఉషారాణి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరూ కలిసి వైసీపీ హయాంలో వలంటీర్లుగా పనిచేశారు. బొడ్లపాడుకు చెందిన తేగెల కృపారాణి అనే మరో యువతితో కూడా భువనేశ్వర్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసి తనను పెళ్లి చేసుకోవాలని ఉషారాణి.. ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు భువనేశ్వర్.. కృపారాణితో కలిసి హత్యకు పన్నాగం పన్నాడు. ఈ నెల 5న ఉషారాణికి ఫోన్ చేసి రాయగడకు రావాలని చెప్పాడు. 6న ఆమె డోలమడ సెంటర్‌కు వచ్చింది. భువనేశ్వర్ తన వరసకు తమ్ముడైన సవరిగాన తేజ సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ కారులో ఉషారాణిని ఎక్కించుకుని రాయగడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉషారాణికి మత్తు మాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకుంది. తర్వాత కారులో నవగాం జంక్షన్‌కు వచ్చి ఉషారాణి పరిస్థితిని అక్కడే ఉన్న కృపారాణికి వివరించారు. అక్కడి నుంచి అందరూ కొల్లివలస వరకు చేరుకుని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద కారు ఆపారు. మత్తులో ఉన్న ఉషారాణిని భువనేశ్వర్, తేజ, కృపారాణి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. కొద్ది దూరం ప్రయాణించి మృతదేహాన్ని చెరువులో పడేశారు. ఈ నెల 10న తన కుమార్తె తప్పిపోయినట్టు ఉషారాణి తండ్రి చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుమరాడ పరిధిలోని కామినాయుడు చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఉషారాణి తండ్రికి సమాచారం అందించారు. చివరికి శుక్రవారం ముగ్గురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు.









Comments