• Jun 13, 2026
  • NPN Log

    పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల స్థిరీకరణ దిశగా రష్యా చమురు కొనుగోలు చేయాలని యూఎస్ చెప్పిందని అన్నారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అప్పట్లో అమెరికా భారత్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించింది. చమురు మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా చమురును కొనుగోలు చేయాలని చెప్పింది. ముడి చమురు ధరల లభ్యత, ధరల ఆధారంగా మేము కొనుగోళ్లు చేస్తాము’ అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. రష్యా విషయంలో భారత్ మరీ ఉదారంగా వ్యవహరిస్తూ ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న ఒక విలేకరి ఆరోపణపై మంత్రి ఈ మేరకు స్పందించారు.

     

    ఆ సమయంలో మార్కెట్‌లో ముడి చమురులో అధిక భాగం రష్యాకు చెందినదేనని అన్నారు. భారత్‌కు ఎంతోకాలంగా ముడి చమురును సరఫరా చేస్తున్న పశ్చిమాసియా దేశాల క్రూడాయిల్‌ను ఐరోపా దేశాలు ఎక్కువగా కొనుగోలు చేసేవని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తాము తమ దిశను మార్చుకోవాల్సి వచ్చిందని వివరించారు. రష్యా తమకు స్థిరమైన సరఫరాదారుగా ఉందని కూడా మంత్రి జైశంకర్ తెలిపారు. యూఎస్ మాత్రం పరస్పర విరుద్ధ విధానాలను అవలంబించిందని అన్నారు. యూఎస్ నిర్ణయాలకు నైతిక ప్రాముఖ్యాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయపడ్డారు.

    ‘రష్యా చమురును కొనుగోలు చేస్తున్నామని మొదట సుంకాలు విధించారు. ఆ తరువాత మళ్లీ వాటిని సడలించారు. కాబట్టి, ఇక్కడ ఏదో గొప్ప సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నట్టు భావించకూడదు. ఇది నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించడం అనవసరం’ అని మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement