స్టీల్‌ప్లాంటులో 15 మంది సస్పెన్షన్
విశాఖపట్నం : విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో వరుస ప్రమాదాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. 15 మందిని సస్పెండ్ చేసి, మరో 19 మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. నాసిరకం ముడిపదార్థాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో వాటిపై దృష్టి పెట్టింది. ఉన్నత స్థాయి అధికారులు తనిఖీలకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడినప్పుడు చాలా కాలంగా నాసిరకం మెటీరియల్ వస్తోందని తేలింది. తమ పైస్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతున్నదని సిబ్బంది వివరించారు. స్టీల్ మెల్ట్ షాపు-1, 2లలో హాట్ మెటల్‌కు ఫెర్రో అల్లాయిస్, ఇతర మెటల్స్ కలుపుతారు. అవి నాణ్యమైనవో కావో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తేల్చాలి. వారు రాజీ పడడం వల్లనే నాసిరకం సరకు వినియోగిస్తున్నారని అంచనాకు వచ్చి దానికి బాధ్యులుగా ఎస్ఎంఎస్-1లో ఐదుగురిని, ఎస్ఎంస్-2లో మరో ఐదుగురిని, ఆర్‌ఈడీ (రిఫ్రాక్టరీస్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్)లో ఐదుగురినీ సస్పెండ్ చేశారు. వీరిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొందరిపై వేటుపడే అవకాశం ఉందని తెలిసింది. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి కొందరు సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు అయ్యేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కాగా.. 19 మంది సీనియర్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.









Comments