• Apr 15, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ఫొటోలు, వీడియోలు తీయడం దగ్గర్నుంచీ.. పొలాల్లో పురుగుమందులు చల్లడం దాకా.. కొన్నిదేశాల్లో ఫుడ్‌ డెలివరీ దగ్గర్నుంచీ విపత్తు సమయాల్లో సహాయం చేయడం దాకా.. డ్రోన్లు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి! అవే డ్రోన్లను.. యుద్ధ రంగంలో సైనికులకు శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగించుకుంటే? అనే అద్భుతమైన ఆలోచన హరియాణాకు చెందిన ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్స్‌ (ఎస్‌ఎస్‌ఐ) అనే సంస్థకు వచ్చింది! భారత్‌లోనే తొలి దేశీ సర్జికల్‌ రోబోటిక్‌ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఇది. జనావాసాలకు దూరంగా.. యుద్ధంలో పాల్గొని తీవ్రగాయాలపాలైన సైనికులను త్వరగా అన్ని సదుపాయాలూ ఉన్న ఆస్పత్రులకు చేర్చలేని పరిస్థితుల్లో.. వేగంగా అక్కడికి వెళ్లి, వారికి సర్జరీ/చికిత్స చేయడానికి ఉపయోగపడే నమూనా డ్రోన్‌ను ఇప్పుడీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్‌ పేరు.. ఎస్‌ఎస్‌-విమాన. కొన్ని గాయాలు.. నిర్ణీత సమయం (గోల్డెన్‌ అవర్‌)లోపు చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్‌ అద్భుతంగా ఉపయోగపడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావాన్ని ఆపడం, సైనికుల శరీరాల్లోకి దూసుకుపోయిన తూటాలు, పదునైన వస్తువులను బయటకు తీయడం, గాయాలకు చికిత్స చేయడం, కుట్లు వేయడం వంటి పనులు వీటితో చేయవచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డ్రోన్లు వచ్చే ఏడాదికల్లా ప్రాణాలు కాపాడే మిషన్లు చేపడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జీపీఎస్‌ ఆధారంగా ప్రయాణించే ఈ డ్రోన్లు 30 నిమిషాలపాటు నిరంతరాయంగా ఎగరగలవు. యుద్ధక్షేత్రానికి వెళ్లాక, మరో అరగంటపాటు పనిచేయగల స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో ఎక్కడో దూరంగా కమాండ్‌ సెంటర్‌లో ఉన్న వైద్యులు ఈ డ్రోన్లకు ఉండే రోబోటిక్‌ చేతులను ఉపయోగించి రిమోట్‌ విధానంలో సర్జరీ/చికిత్స చేస్తారన్నమాట. మిలటరీ అవసరాలకే కాదు.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలకు సైతం దీంతో సేవలు అందించవచ్చని ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్స్‌ సీటీవో రామకృష్ణా రెడ్డి తెలిపారు. అయితే.. ఇలా వెళ్లే డ్రోన్లను దారి మధ్యలో ఎవరైనా హ్యాక్‌ చేస్తే? సైనికుల ప్రాణాలు కాపాడడానికి బదులు.. వారిని చంపడానికి ఉపయోగించుకుంటే? ఆ ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో.. ఈ డ్రోన్లను హ్యాక్‌ చేయకుండా ఉండేలా తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని రామకృష్ణా రెడ్డి వివరించారు. ఈ విమాన డ్రోన్‌.. ఎస్‌ఎ్‌సఐ ఇప్పటికే రోబోటిక్‌ సర్జరీల కోసం అభివృద్ధి చేసిన ‘మంత్ర ప్లాట్‌ఫామ్‌’ను ఉపయోగించుకుంటుంది.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement