26 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి
గుంటూరు : గుండె వైఫల్యంతో(కార్డియో మయోపతి) బాధపడుతున్న యువకుడికి ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి కొత్త జీవితం ప్రసాదించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ విజయవంతమైనట్లు వైద్య నిపుణులు ప్రకటించారు. రోగిని డిశ్చార్జి చేస్తున్న సందర్భంగా ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి హార్ట్ ఫెయిల్యూర్, ట్రాన్స్‌ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు కేసు వివరాలను వెల్లడించారు. గుండిమెడ వేద ప్రకాశ్(26) గుంటూరు శారదా కాలనీ నివాసి. మూడేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది మార్చిలో బాధతుడు చికిత్స కోసం ఆస్టర్ రమేశ్‌కు వచ్చాడు. గుండె మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారంగా వైద్యులు సూచించారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. విజయవాడ, మాచవరానికి చెందిన 17 ఏళ్ల జీవన్మృతుడి నుంచి గుండె అందుబాటులోకి వచ్చింది. మే 26న వైద్య నిపుణులు వేద ప్రకాశ్‌కు గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ‘ఆస్టర్ రమేశ్‌లో త్వరలో రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు ప్రారంభిస్తున్నాం. గుండె వైఫల్యం అనగానే జీవితం ముగిసినట్లు కాదు. మెరుగైన వైద్య చికిత్సలతో 15 నుంచి 20 ఏళ్లపాటు రోగుల జీవితం పొడిగించవచ్చు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ అనేది చివరి పరిష్కారం. కార్డియో మయోపతి రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం త్వరలో హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నాం’ అని డాక్టర్ రమేశ్ తెలిపారు. సమావేశంలో వైద్యులు భరత్ సిద్ధార్థ, మృత్యుంజయ్, రవికాంత్, ఎన్ రాజారమేశ్, రాయపాటి మమత, ఆసుపత్రి చైర్మన్ రామ్మోహన్రావు పాల్గొన్నారు.








Comments