• Jun 13, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : అసలును పోలి ఉన్న ఫేక్‌ ఈ-మెయిల్‌ను పంపి సైబర్‌ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ తనకు వచ్చిన ఈ మెయిల్‌లోని సమాచారం మేరకు సంస్థ తరఫున 2026 జనవరి 14న హెచ్‌డీఎఫ్‏సీ బ్యాంకు ఖాతా నుంచి సాధారణ వ్యాపార భాగస్వామి సంస్థకు చెల్లించాల్సిన రూ.10,11,178లను బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ ఈ-మెయిల్‌ నకిలీదని గుర్తించారు. అసలు ఈ-మెయిల్‌ చిరునామాలోని అక్షరాలను స్వల్పంగా మార్చి మోసగాళ్లు నకిలీ ఈ-మెయిల్‌ సృష్టించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    ట్రేడింగ్‌లో భారీ లాభాల పేరుతో...

    ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ఓ వ్యాపారి నుంచి రూ.3.19 లక్షలు కాజేశారు. కూకట్‌పల్లికి చెందిన వ్యాపారికి మే నెలలో 8269986319 నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. కాల్‌ చేసిన మహిళ తనను ప్రియగా పరిచయం చేసుకుని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. షేర్లు, ట్రేడింగ్‌ రంగంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి అతడిని ఆకర్షించింది. బిగ్‌బుల్‌ ట్రేడ్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ లింక్‌ను పంపించి, లాభాలను పరిశీలించడానికి మాత్రమేనని చెప్పి అతడి ట్రేడింగ్‌ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌ తీసుకుంది.

    తొలుత అతడి ఖాతాలో రూ.50 వేల లాభం వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించింది. తర్వాత మరో వ్యక్తితో కలిసి మరింత లాభాల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని అతడిని ప్రోత్సహించింది. వారి సూచనల మేరకు బాధితుడు పలు దఫాలుగా సుమారు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వెబ్‌సైట్‌లో నష్టాలు చూపించగా, వాటిని తిరిగి పొందాలంటే మరో రూ.1 లక్ష చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు డబ్బు చెల్లించినప్పటికీ ఖాతాలో నష్టాలే కనిపించడంతో అనుమానం వచ్చి మోసపోయినట్లు గ్రహించాడు. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    ఆర్‌టీఓ చలాన్‌ పేరిట..

    ఆర్‌టీఓ చలాన్‌ పేరిట వచ్చిన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ఓ మహిళ సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి రూ.3.41 లక్షలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ మహిళకు జూన్‌ 7న 8809610472 నంబర్‌ నుంచి వాట్సా్‌పలో ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో ఫైల్‌ వచ్చింది. ఆర్‌టీఓ అధికారుల నుంచి వచ్చిన సందేశంగా భావించి ఆమె ఫైల్‌పై క్లిక్‌ చేయడంతో మొబైల్‌లో ఏపీకే అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ అయింది. అయితే అది ఓపెన్‌ కాలేదు.

    అనంతరం జూన్‌ 9 నుంచి వరుసగా ఓటీపీ సందేశాలు రావడం ప్రారంభమై, ఆమె బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతా నుంచి పలు లావాదేవీల ద్వారా డబ్బు డెబిట్‌ అయినట్లు గుర్తించారు. వెంటనే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు, అనంతరం బ్యాంకును సంప్రదించి ఖాతా డెబిట్‌లను నిలిపివేయడానికి ఫిర్యాదు చేశారు. అప్పటికే సైబర్‌ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి మొత్తం రూ.3,41,323 కాజేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement