సమ్మక్కసాగర్ కు ఎన్‌వోసీ ఇవ్వండి
హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బ్యారేజీకి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటి నిల్వ వల్ల ఛత్తీస్‌గఢ్ లో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపింది. సమ్మక్కసాగర్‌కు ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయిని గురువారం రాత్రి కలిసిన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు ఆయనకు ఓ లేఖ అందించారు. ప్రాజెక్టు డీపీఆర్ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో పెండింగ్‌లో ఉందని, ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీ ఇస్తే కానీ క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదని మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా నివేదించారు. బ్యారేజీ వల్ల కలిగే ముంపుపై అధ్యయనానికి అవసనరమైన రూ.9.88 కోట్ల నిధులను బీజాపూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కి గత ఏప్రిల్ 29నే అందజేశామని ఉత్తమ్ గుర్తు చేశారు. అధ్యయనం అనంతరం ముంపు భూములకు సముచితంగా పరిహారం చెల్లిస్తామని, ఈ లోగా ఎన్‌వోసీ ఇవ్వాలని కోరారు. డీపీఆర్‌కు అంతర్రాష్ట్ర డైరెక్టరేట్ మినహా సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్లు ఆమోదం తెలిపాయని వివరించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీ ఇస్తే తప్పా బ్యారేజీలో నీటిని నిల్వ చేయలేమని తెలిపారు. అవసరమైతే ముంపునకు అయ్యే వ్యయాన్ని ముందస్తుగా జమ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ చెప్పారు. కాగా, సమ్మక్కసాగర్ బ్యారేజీతో కలిగే ముంపుపై ఐఐటీ ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించగా... బ్యారేజీ వద్ద 87మీటర్ల గరిష్ఠ వరదతో ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుర్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది.
బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా... అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు తేల్చిచెప్పింది. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని... ఆ మేరకు ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ పట్టుబడుతోంది. ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించగా.. ప్రాథమిక నివేదిక ప్రకారం 100 ఎకరాల్లోనే ముంపు ఉందని తేలింది. దాంతో ఆ మేరకు భూములకు పరిహారాన్ని బీజాపూర్ కలెక్టర్ వద్ద ఒక్కరోజులో జమ చేయించడానికి తాము సిద్ధమని ఛత్తీస్‌గఢ్ సీఎంకు మంత్రి ఉత్తమ్ తెలియజేశారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ నివేదిక వచ్చాకే ఎన్‌వోసీ: విష్ణుదేవ్ సాయి
‘‘సమ్మక్కసాగర్ బ్యారేజీకి అనుమతినివ్వాలని కోరుతూ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. బ్యారేజీ వల్ల కలిగే ముంపుపై ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం చేస్తోంది. అధ్యయనం అనంతరం నివేదిక చేతికి వచ్చాకా ఎన్‌వోసీ జారీపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.










Comments