• Sep 20, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రట్టు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈనెల 15న పాటియాలా, పుణె, చండీగఢ్‌లలోని నాలుగు ప్రాంతాల్లో హైదరాబాద్‌ జోన్‌ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. వీటిలో పాటియాలాలో రెండు కాల్‌ సెంటర్లు, పుణెలో మరొకటి నడుస్తున్నట్లు గుర్తించామని వారు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల సమయంలో ఈ కాల్‌సెంటర్లలో సుమారు 220 మంది పనిచేస్తున్నారని, వారి వివరాలు, విధులు, ఎవరికి రిపోర్ట్‌ చేస్తున్నారనే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ కాల్‌ సెంటర్లలో కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, హెడ్‌సెట్లు, మొబైల్‌ ఫోన్లు, నెట్‌వర్కింగ్‌ పరికరాలున్నాయని చెప్పారు. పాటియాలాలోని కాల్‌సెంటర్లలో సోదాల్లో స్పష్టమైన ఆధారాలను ఈడీ అధికారులు గుర్తించారు. పుణెలోని కాల్‌సెంటర్‌లోనూ ఇదే తరహా విధానం అమలవుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి చండీగఢ్‌లోని తన నివాసం నుంచే పాటియాలా కాల్‌సెంటర్లను సమన్వయం చేస్తూ నియంత్రిస్తున్నట్లు గుర్తించామని, అక్కడి నుంచి పలు డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు వివరించారు. ఈ మోసం ద్వారా అమెరికన్‌ డాలర్లలో వచ్చిన డబ్బును భారత కరెన్సీలోకి మార్చడంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న మరో వ్యక్తి సైతం ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు గుర్తించామని, అతడి పాత్రతో పాటు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నామన్నారు. సోదాల్లో మొత్తం 66 మొబైల్‌ ఫోన్లు, 13 ల్యాప్‌టా్‌పలు, హార్డ్‌డి్‌స్కలు, ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలతో పాటు నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాల్‌ చేయడానికి ఉపయోగించిన స్ర్కిప్టులు, డయలర్‌, వీఓఐపీ వ్యవస్థలు, బాధితుల సమాచారం, చెల్లింపుల మార్గాలు, కాల్‌ సెంటర్లను నిర్వహిస్తున్న వ్యక్తులు, సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement