అమెరికాకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ నిరాకరిస్తే యుద్ధానికి సిద్ధమని హెచ్చరిక!
దీర్ఘకాలంగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికాకు ఇరాన్ 7 షరతులు పెట్టినట్టు సమాచారం. తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ హెచ్చిరించినట్టు తెలుస్తోంది. ఖతార్ ద్వారా అమెరికాకు ఈ షరతులు చేరాయి. అయితే ఇప్పటిదాకా ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాము చర్చల్లో పాల్గొనాలంటే కచ్చితంగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసెన్ రెజాయీ తెలిపారు. ‘యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో 7 షరతులను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ ద్వారా అమెరికాకు పంపించాం’ అని ఆయన వెల్లడించారు. యుద్ధానికి ముగింపు, అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, నౌక మార్గాలపై అమెరికా దిగ్బంధం ఎత్తివేత వంటివి ఈ షరతుల్లో ఉన్నాయంటూ వివరించారు.
పూర్తిస్థాయి నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధం
షరతులకు అంగీకరిస్తారా లేదా అనేది అమెరికా ఇష్టమని రెజాయీ చెప్పారు. ఏదేమైనా తాము పూర్తిస్థాయి నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు. కాగా గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ శాంతి చర్చలు నిర్వహిస్తున్నాయి. ఈ చర్చలు ఫలించక యుద్ధం కొనసాగుతూనే ఉంది.
అణు పరీక్షలపై ఇరాన్ మాట
అణు పరీక్షలకు దూరంగా ఉంటామని గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించాలని తమకు లేదని, కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునేలా అమెరికా చర్యలుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే అణ్వాయుధాలకు వ్యతిరేకంగా తమ మత శాసనాలకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.









Comments