ఏఐని వాడి మెటా, గూగుల్‌ను ఓడించి..!
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఓ కేసులో టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్‌ను అమెరికాకు చెందిన న్యాయవాది ఓడించారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తనను ఆన్‌లైన్‌కు బానిసను చేశాయంటూ ఓ 20 ఏళ్ల అమ్మాయి వేసిన కేసును వాదించేందుకు ఏఐ సాయం తీసుకున్నట్లు టెక్సా్‌సకు చెందిన లాయర్ మార్క్ లానియర్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసుకు సంబంధించి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది మొదలు.. దాదాపు కేసు పూర్తయ్యే నెల రోజుల వరకు ఏఐ టూల్స్‌ని కేసు కోసం వాడుకున్నట్లు వెల్లడించారు. చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ప్రధాన మోడళ్లకు యాక్సె్‌సను అందించే కస్టమైజ్డ్ చేసిన బూడిల్ బాక్స్ అనే ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ను కేసు విచారణ కోసం వాడుకున్నట్లు వివరించారు. అయితే దీనికోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా న్యాయరంగంలో ఏఐని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. ఇక కేసు విషయానికొస్తే.. తాను 8 ఏళ్ల వయసులోనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలు తెరిచానని.. వీటిలో ఉండే ఇన్ఫినిట్ స్ర్కోలింగ్ (ఆగకుండా వచ్చే వీడియోలు, పోస్టులు)కు అలవాటు పడి బానిసలా మారానని బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోయానని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాగే చాలామంది సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారని న్యాయవాది లానియర్ తెలిపారు. ఈ యాప్‌లు ప్రమాదకరమని తెలిసినా మెటా, గూగుల్‌లు.. వాటిని సరి చేయడం కానీ, యూజర్లను హెచ్చరించడం కానీ చేయట్లేదని వాదించారు. దీంతో కోర్టు.. బాధితురాలికి ఆయా సంస్థలు 6 మిలియన్ డాలర్ల(రూ.56 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో మెటా 70ు చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని యూట్యూబ్ చెల్లించాలని స్పష్టం చేసింది.










Comments