• Jun 25, 2026
  • NPN Log

    అమృత్‌సర్ : పాకిస్థాన్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం ప్రవేశించడంపై ఆ సంస్థ స్పందించింది. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. దీనిపై అంతర్గత విచారణ జరుగుతోందని వివరించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. జూన్ 22వ తేదీన ఏఐ479 విమానం ప్రయాణికులతో న్యూఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరిందని చెప్పింది. అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ విమానం దిగాల్సి ఉందని వివరించింది. అయితే ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతి రాక పోవడంతో విమానం గో అరౌండ్‌ ప్రక్రియ చేపట్టిందని తెలిపింది. ఆ క్రమంలో విమానం పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించిందని పేర్కొంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది.

    స్పందించిన డీజీసీఏ..

    ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ఈ విమానం ల్యాండింగ్‌కు ముందు అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో మరో విమానాన్ని పక్షి ఢీ కొందని వివరించింది. ఈ నేపథ్యంలో రన్‌పై సిబ్బంది తనిఖీలు నిర్వహించారని పేర్కొంది. దీంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. పాకిస్థానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయంతోనే ఆ దేశ గగనతలంలోకి విమానం ప్రవేశించిందని వివరించింది. ఆ తర్వాత ఆ విమానాన్ని న్యూఢిల్లీకి మళ్లీనట్లు చెప్పింది. కాగా ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఆపరేటింగ్ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వలేదని.. దాంతో వారిపై తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.

    పాక్ గగనతలంలోకి భారత్ విమానాల ప్రవేశానికి..

    2025, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. వారిలో 25 మంది పర్యాటకులు, ఒకరు స్థానికుడు ఉన్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులంమంటూ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రెంట్ ప్రకటించింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. దీనిపై పాకిస్థాన్ సైతం అదే స్థాయిలో స్పందించి.. భారత్‌‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి.. భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా ఉండడం. దీంతో నాటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఉప్పు.. నిప్పుగా మారిన విషయం విదితమే.

    గో అరౌండ్ అంటే ఏమిటి?

    ఇది సాధారణ విమానయాన భద్రతకు సంబంధించిన ప్రక్రియ. తక్కువ విజిబులిటి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రన్‌వే పై అడ్డంకులు, విమానాల రాక పోకలు వెంటవెంటనే జరగడం తదితర సమయంలో ఈ ప్రక్రియను పైలట్లు చేపడతారు. విమానాన్ని ల్యాండింగ్ చేయకుండా గో అరౌండ్ చేస్తారు. అదీకాక అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్.. భారత్, పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న సంగతి తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement