ఏఐ స్పీడ్‌ను టెక్ కంపెనీలు అడ్డుకుంటున్నాయి.. అమెరికాలో పిటిషన్
దిగ్గజ టెక్ కంపెనీలు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్, గూగుల్ ఏఐ అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నెమ్మది చేసేందుకు అక్రమంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ జిల్లా ఫెడరల్ కోర్టులో శుక్రవారం కేసు దాఖలైంది. ఆ సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. చాట్ జీపీటీ, క్లౌడ్, గ్రోక్, జెమిని వంటి ఏఐ సేవలకు డబ్బులు చెల్లిస్తున్న నలుగురు వినియోగదారులు ఈ కేసు వేశారు. కాగా.. భద్రతా కారణాల వల్ల ఏఐ అభివృద్ధికి కొంత కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ ఈనెల 12న ఒక వ్యాసం రాశారు. కంపెనీలన్నీ సమన్వయం చేసుకుని ఏఐ భద్రతా చర్యలను పెంచాలని ఆయన తన వ్యాసంలో సూచించారు. అదేరోజు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ డీప్ మైండ్ సహవ్యవస్థాపకుడు డెమిస్ హసాబిస్ కూడా అమోడెయ్ ప్రతిపాదనలకు మద్దతు తెలిపారని పిటిషనర్లు పేర్కొన్నారు.
వినియోగదారులకు నష్టం జరుగుతుందా?
ఏఐ సంస్థలు అభివృద్ధిని నెమ్మది చేస్తే పోటీ తగ్గి, డబ్బులు చెల్లించే వినియోగదారులకు అందించే సేవల విలువ కూడా తగ్గుతుందని పిటిషనర్లు తమ పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషనర్ల తరపు న్యాయవాది నిక్ రౌలీ మాట్లాడుతూ.. ఏఐ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు కొన్ని ప్రైవేట్ టెక్ సంస్థల మధ్య ఒప్పందాల ద్వారా కాకుండా పారదర్శకమైన ప్రభుత్వ విధానాల ద్వారా జరగాలని వాదించారు. ఇక ఏఐ అభివృద్ధిని నియంత్రించాలా, లేక వేగంగా కొనసాగించాలా అనే అంశంపై అమెరికాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఆంత్రోపిక్ వంటి సంస్థలు ఏఐ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతుండగా, మరోవైపు ఏఐలో చైనాను దాటిపోవాలని అమెరికా వాదిస్తోంది.










Comments